Siddipet Firing: సిద్దిపేట జిల్లాలో ఓ వ్యక్తి తన పొరిగింట్లోకి ఏకే-47 తుపాకీతో కాల్పులు, ఉలిక్కిపడిన గ్రామస్తులు, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Image used for representational purpose only (Photo Credits: Getty)

Siddipet, February 7: సిద్ధిపేట జిల్లాలోని అక్కన్నపేటలో (Akkannapet PS) ఓ వ్యక్తి తన పొరుగింటి వారిపై ఆటోమేటిక్ రైఫిల్, ఏకే- 47ను (AK 47 Rifle) ఉపయోగించి కాల్పులు జరపడం జిల్లాలోనే సెన్సేషన్ గా మారింది. కాల్పులు జరిపిన వ్యక్తిని సదానందంగా (Sadanandam) గుర్తించారు. ఘటనాస్థలం నుంచి బుల్లెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

ఇప్పటివరకూ అందిన సమాచారం మేరకు, గ్రామానికి చెందిన సదానందంకు మరియు తన పక్కింట్లో ఉండే గంగరాజుకు (Gangaraju) మధ్య గత కొంతకాలంగా ఓ స్థలం సరిహద్దు గోడ, మరియు ఇటుకలకు సంబంధించిన వివాదాలు ఉన్నట్లు తెలిసింది. ఆరు నెలల క్రితం ఈ వివాదం మొదలైందని గంగరాజు కుటుంబ సభ్యులు తెలిపారు. మూడు రోజుల క్రితం సదానందం కత్తితో వచ్చి గంగరాజును బెదిరించాడని, దుర్భాషలాడాని అతడి భార్య తెలిపింది.

ఇదే క్రమంలో గురువారం రాత్రి 9 గంటల సమయంలో సదానందం తన ఇంట్లో నుంచే పక్కింట్లో ఉన్న గంగరాజును లక్ష్యంగా చేసుకొని కిటికీ గుండా ఏకే47 తుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. అయితే ఈ ప్రమాదం నుంచి గంగరాజు త్రుటిలో తప్పించుకున్నాడు.

ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో కిందికి వంగడం ద్వారా బుల్లెట్లు తాకలేదు,  తలపైనుండి బుల్లెట్లు దూసుకుపోయాయని గంగరాజు పేర్కొన్నాడు. ఈ విషయం తెలుసుకొని పెద్దఎత్తున ప్రజలు గంగరాజు ఇంటికి చేరుకున్నారు. కాగా, ఆ వెంటనే సదానందం అక్కడ్నించి పారిపోయాడు. ప్రస్తుతం పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. అయితే సదానందం వద్దకు ఏకే47 ఎలా వచ్చింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అతని ఇంట్లో తనిఖీలు చేసి కొన్ని కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. గంగరాజు కుటుంబ సభ్యులను కూడా పోలీసులు ప్రశ్నించారు.