Mann Ki Baat 78th Edition Highlights: కరోనాపై పోరాటం ఆగదు, వ్యాక్సిన్ వేయించుకునేందుకు భయపడకండి, మ‌న్ కీ బాత్ రేడియో కార్యక్ర‌మంలో ప్రధాని నరేంద్ర మోదీ, దేశం మిల్కా సింగ్‌‌ను కోల్పోవడం కలచివేసే పరిణామమని తెలిపిన భారత ప్రధాని
PM Modi (Photo-ANI)

New Delhi, June 27: కరోనా వైరస్‌తో దేశ ప్ర‌జ‌ల పోరాటం కొన‌సాగుతోంద‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. ఈ రోజు ఆయ‌న మ‌న్ కీ బాత్ (Mann Ki Baat) రేడియో కార్యక్ర‌మంలో మాట్లాడుతూ... కోవిడ్ (Covid) మీద క‌లిసిక‌ట్టుగా పోరాడుతూ ఎన్నో విజ‌యాలు సాధించామ‌ని పీఎం తెలిపారు. వ్యాక్సిన్ల‌పై భ‌యాన్ని వ‌దులుకోవాల‌ని ఆయ‌న కోరారు. వ్యాక్సిన్ వేయించుకుంటే కొంద‌రికి కొన్ని గంటల పాటు సాధార‌ణ జ్వ‌రం రావ‌చ్చ‌ని, అనంత‌రం అది కూడా ఉండ‌ద‌ని మోదీ చెప్పారు. ఒక రోజులో 86 లక్షలు కన్నా ఎక్కువ మందికి టీకాలు వేసి భారత దేశం చరిత్ర సృష్టించిందని తెలిపారు.

క‌రోనా వ్యాక్సిన్‌ను (Corona Vaccine) తిర‌స్క‌రించ‌డం చాలా ప్ర‌మాదక‌ర‌మ‌ని తెలిపారు. మ‌న‌కు క‌రోనా సోకితే మ‌న‌కే కాకుండా మ‌న కుటుంబ స‌భ్యులు, గ్రామ‌స్థుల‌కు కూడా ప్ర‌మాదమ‌ని చెప్పారు. దేశంలోని చాలా గ్రామాల్లో 100 శాతం వ్యాక్సినేష‌న్ పూర్తి చేసుకుని ఆద‌ర్శంగా నిలిచాయ‌ని తెలిపారు.కొద్ది రోజుల క్రితం మునుపెన్నడూ లేని అద్భుతాన్ని మన దేశం సాధించిందన్నారు. జూన్ 21న 86 లక్షల మందికి పైగా ఉచిత వ్యాక్సిన్ తీసుకున్నారని, ఒక రోజులో ఇంత ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకోవడం గొప్ప రికార్డు అని పేర్కొన్నారు.

దేశంలో పెరుగుతున్న డిశ్చార్జ్ కేసులు, 24 గంట‌ల్లో 57,944 మంది కోలుకుని ఇంటికి, తాజాగా 50,040 క‌రోనా కేసులు న‌మోదు, డిసెంబర్‌ 31 కల్లా 18 ఏళ్లు నిండిన వారందరికీ టీకాలు

టోక్యో ఒలింపిక్స్ త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఆ క్రీడల గురించి మ‌నం మాట్లాడుకుంటున్నామ‌ని మోదీ చెప్పారు. ఈ స‌మ‌యంలో అథ్లెట్ మిల్కా సింగ్‌ను గుర్తు చేసుకోకుండా ఉండ‌లేమ‌ని తెలిపారు.ఆయనకు నివాళి అర్పించారు కొవిడ్‌పై పోరాడుతూ మిల్కా సింగ్ ప్రాణాలు కోల్పోయార‌ని, దీంతో దేశం ఆయ‌న‌ను కోల్పోయింద‌ని వ్యాఖ్యానించారు. ఆయ‌న ఆసుప‌త్రిలో ఉన్న స‌మ‌యంలో తాను ఆయ‌న‌తో మాట్లాడాన‌ని మోదీ చెప్పారు.

ఆయనను కాపాడుకోవడానికి డాక్టర్లు విశ్వ ప్రయత్నాలు చేశారని, అవి విజయవంతం కాలేకపోవడం తనను కలచి వేసిందని అన్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనబోయే క్రీడాకారులందరూ మిల్ఖా సింగ్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. 1964 టోక్యో ఒలింపిక్స్ గురించి ప్ర‌స్తావించాన‌ని తెలిపారు. క్రీడ‌ల‌కే త‌న జీవితాన్ని అంకితమిస్తూ మిల్కా స్ఫూర్తిదాయ‌కంగా నిలిచార‌ని కొనియాడారు.

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యాన్ని వహించనున్న నేహా గోయెల్, ప్రవీణ్, దీపికా కుమారి, ప్రియాంక, శివ్‌పాల్ సింగ్, చిరాగ్ షెట్టి, సాత్విక్, మనీష్ కౌశిక్, సీఏ భవానీదేవి వంటి క్రీడాకారులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఒలింపిక్స్‌ గురించి ప్రస్తావించిన ప్రతీసారీ మిల్ఖాసింగ్‌ను ప్రస్తావించడం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని మోడీ సూచించారు. ప్రతి విభాగంలోనూ పతకాలను సాధించాలనే అకాంక్షను వ్యక్తం చేశారు.

మధ్య ప్రదేశ్‌లోని బేటుల్ జిల్లా, దులేరియా గ్రామస్థులతో మోదీ మాట్లాడారు. వ్యాక్సిన్‌పై సందిగ్ధతను తమ గ్రామంలో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారని గ్రామస్థులు ఆయనకు తెలిపారు. దీనిపై స్పందించిన మోదీ మాట్లాడుతూ, వదంతులను నమ్మవద్దని వారికి నచ్చజెప్పారు. తాను రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నానని తెలిపారు. తన తల్లి వయసు సుమారు వందేళ్ళు ఉంటుందని, ఆమె కూడా రెండు డోసులను తీసుకున్నారని తెలిపారు. వ్యాక్సిన్‌కు వ్యతిరేకంగా జరిగే ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు.

వదంతులను ప్రచారం చేసేవారిని చెయ్యనివ్వండని చెప్తూ, మనమంతా కలిసికట్టుగా ఉంటూ, మన పని మనం చేద్దామని, మన చుట్టూ ఉన్నవారు వ్యాక్సిన్ వేయించుకునేలా కృషి చేద్దామని చెప్పారు. వ్యాక్సిన్లపై సందిగ్ధతను విడనాడాలన్నారు. నూటికి నూరు శాతం మంది వ్యాక్సిన్ వేయించుకున్న గ్రామాలు మన దేశంలో చాలా ఉన్నట్లు తెలిపారు. కోవిడ్-19 ముప్పు ఇంకా పొంచి ఉందన్నారు. ప్రజలు వ్యాక్సినేషన్‌పైనా, కరోనా వైరస్ నిరోధక మార్గదర్శకాలను పాటించడంపైనా దృష్టి సారించాలని కోరారు.