A resident gets tested for coronavirus in the Liwan District in Guangzhou in southern China (Photo: PTI)

New Delhi, June 27: దేశంలో నిన్న 50,040 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Health Ministry) ప్ర‌క‌టించింది. దాని ప్రకారం.. 24 గంట‌ల్లో 57,944 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,02,33,183కు (Covid in India) చేరింది. ఇక మరణాల విషయానికొస్తే, నిన్న‌ 1,258 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,95,751 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,92,51,029 మంది కోలుకున్నారు. 5,86,403 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా రికవరీ రేటు 96.75 శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

దేశంలో 18 ఏండ్లు పైబడిన వారందరికీ ఈ ఏడాది డిసెంబర్‌ 31 నాటికల్లా కరోనా టీకాలు వేసేందుకు ప్రయత్నిస్తున్నామని శనివారం కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఉచిత టీకా పొందేందుకు అందరూ అర్హులేనని పేర్కొంది. గత నెల 31న జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ విధానంపై పలు ప్రశ్నలను లేవనెత్తింది. వాటిపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ 375 పేజీల అఫిడవిట్‌ను దాఖలు చేసింది.

డేంజర్‌గా మారిన డెల్టా వేరియంట్‌, ధర్డ్ వేవ్ ముప్పుతో 85 దేశాల్లో హైఅలర్ట్, మరోసారి కఠిన ఆంక్షలు విధించుకుంటున్న మెజార్టీ దేశాలు, ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ టెడ్రస్‌ అధానోమ్‌, ఇండియాలో పెరుగుతున్న డెల్టా ప్లస్ కేసులు

వ్యాక్సిన్‌ సేకరణలో ఎదురవుతున్న సమస్యలపై రాష్ర్టాలు, ప్రైవేటు ఆస్పత్రులు ఫిర్యాదు చేయడంతో విధానంలో మార్పులు చేసినట్టు అఫిడవిట్‌లో తెలిపింది. దేశంలో ఆగస్టు-సెప్టెంబరు మధ్యలో 135 కోట్ల డోసులను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించింది. మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సదుపాయం పరిమితంగా ఉండటం వ్యాక్సినేషన్‌పై ప్రతికూల ప్రభావం చూపదని తెలిపింది.

వ‌చ్చే ఆగ‌స్టు నుంచి డిసెంబ‌ర్ మ‌ధ్య కొవిషీల్డ్ డోసులు 50 కోట్లు, కొవాక్సిన్ డోసులు 40 కోట్లు, బ‌యో ఈ స‌బ్ యూనిట్ వ్యాక్సిన్ డోసులు 30 కోట్లు, జైడ‌స్ క్యాడిలా డీఎన్ఏ వ్యాక్సిన్ డోసులు 5 కోట్లు, స్ఫుత్నిక్ వీ వ్యాక్సిన్ డోసులు 10 కోట్లు అందుబాటులోకి రానున్నాయ‌ని కేంద్రం త‌న అఫిడ‌విట్‌లో వివ‌రించింది.