Delta Variant: డేంజర్‌గా మారిన డెల్టా వేరియంట్‌, ధర్డ్ వేవ్ ముప్పుతో 85 దేశాల్లో హైఅలర్ట్, మరోసారి కఠిన ఆంక్షలు విధించుకుంటున్న మెజార్టీ దేశాలు, ఆందోళన వ్యక్తం చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ టెడ్రస్‌ అధానోమ్‌, ఇండియాలో పెరుగుతున్న డెల్టా ప్లస్ కేసులు
Delta Plus Still 'Variant of Interest' Representative Image

Geneva, June 26: కరోనాలో పుట్టుకొచ్చిన అనేక వేరియంట్లలో ‘డెల్టా’ వేరియంటే అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోందని (Delta the 'most transmissible' of variants) ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ టెడ్రస్‌ అధానోమ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. టీకాలు వేసుకోనివారే ఎక్కువగా దీని బారిన పడుతున్నారని ఆయన హెచ్చరించారు. ‘‘డెల్టా వేరియంట్‌పై (Delta Variant) యావత్ ప్రపంచం కలవరపడుతోంది. డబ్ల్యూహెచ్‌ఓ కూడా దీనిపై ఆందోళన చెందుతోంది. ఇప్పటివరకు గుర్తించిన అన్ని కరోనా రకాల్లో ఇదే అత్యంత వేగంగా వ్యాపిస్తోన్న వేరియంట్‌.

కనీసం 85 దేశాల్లో డెల్టా కేసులు బయటపడ్డాయి. టీకాలు వేసుకోని వారిలో మరింత వేగంగా వ్యాప్తి (spreading rapidly among unvaccinated populations) చెందుతోంది’’ అని టెడ్రస్‌ (WHO chief) చెప్పుకొచ్చారు. డెల్టా వేరియంట్ 85 దేశాల్లో విస్తరించిందని, ఇది మరిన్ని దేశాల్లో ప్రబలం కావచ్ఛునని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. 170 దేశాల్లో వేరియంట్ అల్ఫా, 119 దేశాల్లో వేరియంట్ బేటా, 71 దేశాల్లో గామా కొనసాగుతున్నాయని. వీటిని నిర్లక్ష్యం చేయరాదని ఈ సంస్థ ఈ నెల 22 నాటి తన తాజా నివేదికలో తెలిపింది.

ఇండియాలో డెల్టా ప్లస్ కేసులు మెల్లగా మెరుగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటకవంటి రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ కేసులు బయటపడుతున్నాయి. మధ్యప్రదేశ్ లో ఓ మహిళ ఈ వ్యాధితో మరణించింది. మరో 14 మందికి సంబంధించిన శాంపిల్స్ ను వైరాలజీ ఇన్స్ టిట్యూట్ కి పంపారు. మొదట 22 కేసులతో మొదలైన డెల్టా ప్లస్ కేసులు క్రమేపీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోందని అంటున్నారు. వేగంగా వ్యాప్తి చెందగల ఈ వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసినట్టు తెలుస్తోంది.

దేశంలో రోజు రోజుకు తగ్గుతున్న కేసులు, కొత్తగా 48,698 మందికి కరోనా, 24 గంట‌ల్లో 64,818 మంది డిశ్చార్జ్, ప్రస్తుతం 5,95,565 కోవిడ్ యాక్టివ్ కేసులు, డెల్టా ప్ల‌స్ వేరియంట్‌పై వారంలో వ్యాక్సిన్ సామ‌ర్ధ్యం తేల‌నుందని తెలిపిన ఐసీఎంఆర్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ డాక్ట‌ర్ బ‌ల్‌రాం భార్గ‌వ

కాగా ఇటీవల చాలా దేశాలు కరోనా నిబంధనలను సడలిస్తూ వస్తున్నాయని, దీంతో ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కేసులు పెరగడం ప్రారంభమైందని తెలిపారు. కరోనా వైరస్‌ మరింత రూపాంతరం చెందే అవకాశముందని హెచ్చరించిన ఆయన.. వైరస్ వ్యాప్తిని నిరోధించడంతోనే కొత్త వేరియంట్లు పుట్టుకురాకుండా అడ్డుకోవచ్చని చెప్పారు. వైరస్ వ్యాప్తి వేగంలో ఆల్ఫా వేరియంట్‌ తర్వాత డెల్టానే ప్రమాదకర రకమని డబ్ల్యూహెచ్‌ఓ కొవిడ్-19 టెక్నికల్‌ హెడ్‌ డాక్టర్‌ మరియా వాన్‌ పేర్కొన్నారు. టీకాలు వేసుకోనివారికి ఈ వేరియంట్‌ ముప్పు అధికంగా ఉందని ఆమె హెచ్చరించారు.

కొన్ని దేశాల్లో టీకా పంపిణీ వేగంగా సాగుతున్నప్పటికీ.. ఇంకా పూర్తి స్థాయిలో ప్రజలందరికీ వ్యాక్సిన్లు అందలేదని చెప్పారు. కరోనా వేరియంట్‌ ఏదైనప్పటికీ.. దాని వ్యాప్తిని, తీవ్రతను తగ్గించడంలో వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేస్తాయని తెలిపారు. అయితే కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని, ప్రజలంతా నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా, సురక్షితంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు.

డెల్టా వేరియంట్ విజృంభించక ముందే.. పేద దేశాల‌కు క‌రోనా వ్యాక్సిన్లు అందేలా చేయాల‌ని.. టీకా ఉత్ప‌త్తి చేస్తోన్న దేశాల‌ను కోరారు. ధ‌నిక దేశాల్లో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ స‌జావుగానే కొన‌సాగుతోంద‌ని పేద దేశాల‌కు మాత్రం అంద‌డం లేద‌ంటూ ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. క‌రోనాతో ముప్పు లేని యువ‌త‌కు కూడా ధ‌నిక దేశాలు వ్యాక్సిన్లు అందిస్తుండ‌గా పేద దేశాల్లో రిస్క్ ఉన్న వారికి కూడా అంద‌డం లేదని పేర్కొన్నారు. అయితే.. ఆఫ్రికాలో ఈ ప‌రిస్థితి దారుణంగా ఉంద‌న్నారు. వారం రోజుల క్రితం ఉన్న ప‌రిస్థితుల‌తో పోల్చి చూస్తే ప్ర‌స్తుతం ఇన్‌ఫెక్ష‌న్లు, మ‌ర‌ణాలు 40 శాతం పెరిగాయ‌ని గెబ్రియేసెస్ ఆందోళన వ్యక్తంచేశారు.

డెల్టా వేరియంట్ వైర‌స్ ప్ర‌పంచ వ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతోంద‌ని.. ఈ తరుణంలో ప్ర‌పంచ దేశాల‌కు వ్యాక్సినేష‌న్ అందించ‌డంలో విఫ‌ల‌మ‌వుతున్నామ‌న్నారు. వ్యాక్సిన్ల స‌ర‌ఫ‌రా స‌మ‌స్య‌గా మారింద‌ని.. ముందు ఆఫ్రికా దేశాల‌కు వ్యాక్సిన్లు పంపాల‌ని ఆయ‌న వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తున్న దేశాలను కోరారు.

డెల్టా వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో అప్రమత్తమైన ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్‌ దేశాలు తాజాగా మరోసారి ఆంక్షలను విధిస్తున్నట్లు ప్రకటించాయి. సిడ్నీలో వారంపాటు లాక్‌డౌన్‌ విధించారు. ఒకవారం రోజుల పాటు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆస్ట్రేలియాలో గతవారంలోనే 65 పాజిటివ్‌ కేసులను గుర్తించారు. కరోనా మహమ్మారి బయటపడిన తర్వాత అత్యంత భయంకరమైన పరిస్థితిని ఇప్పుడే చూస్తున్నామని న్యూసౌత్‌వేల్స్‌ ప్రీమియర్‌ గ్లాడీస్‌ బెరెజిక్లెయిన్‌ పేర్కొన్నారు.

ప్రపంచంలో అత్యధిక వేగంగా టీకా పంపిణీ చేస్తున్న దేశాల్లో ఇజ్రాయెల్‌ మొదటి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. దీంతో వైరస్‌ వ్యాప్తి అదుపులోకి వచ్చిందని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో ఇండోర్‌ ప్రదేశాల్లో మాస్కులు ధరించాల్సిన అవసరం లేదని పదిరోజుల క్రితం ఇజ్రాయెల్‌ ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ నిర్ణయం తీసుకున్న నాలుగు రోజులకే నిత్యం వంద కేసులు బయటపడడం మొదలయ్యింది. కేవలం గురువారం ఒక్కరోజు 227 కేసులు వెలుగుచూశాయి. దీంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్‌, మాస్కుల నిబంధన సడలింపును ఎత్తివేసింది. ఇండోర్‌ ప్రాంతంలో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆదేశించింది. అంతేకాకుండా పరిస్థితిని బట్టి మరిన్ని ఆంక్షలు విధించాలని యోచిస్తోంది. దేశంలో వైరస్‌ విజృంభణకు డెల్టా వేరియంట్‌ కారణం కావచ్చని ఇజ్రాయెల్‌లో కరోనాపై ఏర్పాటు చేసిన జాతీయ టాస్క్‌ఫోర్స్‌ చీఫ్ పేర్కొన్నారు.

అటు ఆఫ్రికాలోనూ డెల్టా వేరియంట్‌ విలయం సృష్టిస్తున్నట్లు అక్కడి సీడీసీ వెల్లడించింది. ఇప్పటివరకు 14 దేశాల్లో ఈ వేరియంట్‌ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా గడిచిన మూడు వారాలుగా వైరస్‌ విజృంభణ మరింత ఎక్కువైనట్లు ఆయా దేశాలు వెల్లడిస్తున్నాయి. ఆఫ్రికా ఖండాన్ని మూడో వేవ్‌ తాకిందని ఆఫ్రికాలోని వ్యాధుల నియంత్రణ, నిర్మూలన కేంద్రం (ఆఫ్రికా సీడీసీ) డైరెక్టర్‌ జాన్‌ కెంగాసాంగ్‌ వెల్లడించారు. ఈ దఫా విజృంభణతో మరింత దారుణ పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డెల్టా వేరియంట్‌ ప్రభావం కాంగో, ఉగాండాలో మరింత ఎక్కువగా ఉన్నట్లు ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వెల్లడించింది.

కరోనా వైరస్‌ వెలుగు చూసిన తొలినాళ్లలో మహమ్మారిని కట్టడి చేయడంలో ఫిజీ దేశం విజయం సాధించింది. గడిచిన ఏడాది కాలంగా అక్కడ పాజిటివ్‌ కేసుల జాడ కనిపించలేదు. కానీ, తాజాగా అక్కడి కొవిడ్‌ ఉద్ధృతి మళ్లీ మొదలయ్యింది. గురవారం ఒక్కరోజే 300 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఏప్రిల్‌ నెలలో వెలుగు చూసిన డెల్టా వేరియంట్‌తో మళ్లీ విజృంభణ మొదలైనట్లు అక్కడి అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం వైరస్‌ సామాజిక వ్యాప్తి దశకు చేరుకుందని ఫిజీ ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. దీంతో మరోసారి కొవిడ్ కట్టడి ఆంక్షలకు ఉపక్రమించారు.

ఇప్పటికే డెల్టా వేరియంట్‌ దాటికి భారత్‌ కూడా వణికిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఇండియాలో డెల్టా ప్లస్ వేరియంట్‌ ధర్డ్ వేవ్ కి కారణమవుతందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే డెల్టా ప్లస్ వేరియంటే థర్డ్ వేవ్ కు కారణమవుతుందని ఇప్పుడే చెప్పలేమని ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ రణ్ దీప్ గులేరియా అన్నారు. అయితే డెల్టా వేరియంట్ నుంచే ఇది మ్యూటెంట్ అయింది కాబట్టి అప్రమత్తంగా ఉండాలన్నారు. డెల్టా వేరియంట్లు వేగంగా వ్యాపిస్తాయన్నారు. కేసుల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడే కట్టడి చేయాలన్నారు. లేకపోతే సెకండ్ వేవ్ లాగా పరిస్థితి చేయిదాటి పోతుందన్నారు. వేరియంట్ ఏదైనా మనం తీసుకునే జాగ్రత్తలే కీలకమన్నారు.

చిన్నపిల్లలపై థర్డ్ వేవ్ ఎఫెక్ట్ ఉండదని మరోసారి గులేరియా చెప్పారు. 2 నుంచి 18ఏళ్లున్న వాళ్లకు వ్యాక్సినేషన్ ట్రయల్స్ కొనసాగుతున్నాయన్నారు. 2 నుంచి 3నెలల్లో ఫలితాలు వస్తాయన్నారు. ట్రయల్స్ కు వచ్చిన చిన్నారుల్లో సగానికి పైగా మందికి ఆల్ రెడీ యాంటీబాడీస్ ఉంటున్నట్లు గుర్తించామన్నారు. అయితే వారికి కరోనా సోకినట్లు ఎలాంటి ఆధారాలు కనిపించట్లేదన్నారు. పిల్లల్లో ముందే యాంటీబాడీలు డెవలప్ అవడాన్ని బట్టి చూస్తే థర్డ్ వేవ్ వారిపై పెద్దగా ప్రభావం చూపించబోదన్నారు.