Image used for representational purpose | (Photo Credits: PTI)

New Delhi, Oct 15: కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రైతుల ఉద్యమ శిబిరం వద్ద యువకుడి దారుణ హత్య ఉద్రిక్తతకు దారితీసింది. శుక్రవారం రైతు నిరసన శిబిరం వద్ద అనుమానాస్పద మృతదేహం (Man's Body With Chopped Hand Found) కలకలం రేపింది. వేదిక సమీపంలో ఉన్న బారీకేడ్ కు ఓ వ్యక్తి మృత దేహం వేలాడుతున్న విషయాన్ని శుక్రవారం ఉదయం గుర్తించారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. నిహాంగ్‌ సిక్కులే ఆ వ్యక్తిని హతమార్చారని (Farmers' Protest Site Near Singhu Border) రైతు సంఘం నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో సంయుక్త కిసాన్ మోర్చా అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. దీనిపై ఒకప్రకటన వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

సోనిపట్‌ జిల్లా కుండ్లిలోని రైతు నిరసన వేదిక వద్ద యువకుడి మృతదేహం పోలీసు బారికేడ్‌కు వేలాడుతూ కనిపించింది. బాధితుడిని లఖ్‌వీర్ సింగ్‌గా గుర్తించారు. ఎడమ మణికట్టు తెగిపడి రక్తపు మడుగులో ఉన్న వైనం ఆందోళన రేపింది. సిక్కుల పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్‌ను అపవిత్రం చేసినందుకు నిహాంగ్‌లు లఖ్‌బీర్ సింగ్‌ను కొట్టి చంపారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు దీనిపై హర్యానా పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. చేతులు, కాళ్లు నరికివేసి ఉన్న మృతదేహాన్ని గుర్తించినట్టు పోలీసున్నతాధికారి హన్సరాజ్‌ తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్ట్‌ నిమిత్తం సోనిపట్‌ సివిల్‌ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు బాధ్యులు ఎవరు అనేదానిపై ఆరా తీస్తున్నామన్నారు.

లఖింపూర్ ఖేరీ హింసాకాండ, మూడు రోజుల పోలీసు రిమాండ్‌కు ఆశిష్ మిశ్రా, మహా వికాస్ అఘాడీ తలపెట్టిన రాష్ట్రవ్యాప్త బంద్‌ విజయవంతం

సుమారు గత ఏడాది కాలంగా వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు నిరసన కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్‌ ఖేరీ వద్ద జరిగిన హింసలో రైతులు ప్రాణాలు కోల్పోవడం ఉద్రిక్తతను రాజేసింది. రైతుల్ని కారుతో గుద్ది హత్య చేశారన్న ఆరోపణలపై కేంద్ర హోం శాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంఘటనా స్థలంలో గురువారం పోలీసులు సీన్‌ రీక్రియేషన్‌ కార్యక్రమన్ని కూడా చేపట్టారు.