Kuno, May 9: మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో గాయపడిన కొన్ని గంటల తర్వాత మరో చిరుత మృతి చెందింది. దాదాపు 40 రోజుల వ్యవధిలో పార్కులో మరణించిన మూడో చిరుత దక్ష. మరో రెండు మగ చీతాలతో జతకట్టిన సమయంలో గాయపడటంతో.. కొద్దిగంటల్లోనే దక్ష మృతి చెందిందని, ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ జేఎస్ చౌహాన్ అన్నారు.
తాము ఆ ఆడ చీతాకు అవసరమై అన్ని మందులు, చికిత్స తక్షణమే అందించామని, కానీ మధ్యాహ్నం 12 గంటలకే మరణించిందని అధికారి చౌహాన్ తెలిపారు. వాయు, అగ్ని అనే మగ చీతాలతో సంభోగ సమయంలో అవి పరస్పరం హింసాత్మక దాడులు చేసుకున్నాయని, అందువల్లే దక్ష అనే చీతా మరణించిందని చౌహాన్ తెలిపారు.
ఎన్‌క్లోజర్ నెంబర్ వన్‌లో ఉన్న దక్షను బోమా 7 ఎన్‌క్లోజర్‌లో ఉన్న వాయు, అగ్ని అనే రెండు మగ చీతాలతో సంభోగం కోసం విడుదల చేశారు.
అయితే ఈ ప్రక్రియలో మగ చిరుతలు హింసాత్మకంగా మారినట్లు కనిపిస్తోంది. కానీ ఇది చాలా సర్వ సాధారణ విషయమని చౌహాన్ చెబుతున్నారు. మగ చిరుతలు జత కట్టే సమయంలో తమకు సంబంధంలేని మగ చిరుతలతో దాడులకు దిగుతాయని, గెలిచిన మగ చిరుత ఆడ చిరుతతో జత కడుతుందని ఆయన తెలిపారు.
గతేడాది ప్రాజెక్టు చీతా కింద దక్షిణాఫ్రికా నుంచి దాదాపు ఇరవై చీతాలను జాతీయ పార్కుకి తీసుకురాగా వాటిలో సాషా, ఉదయ్ అనే రెండు చిరుతలు మార్చి, ఏప్రిల్‌లో చనిపోయిన సంగతి తెలిసిందే. నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి ఆ రెండు చిరుతలను సెప్టంబర్ 2022లో వేర్వేరు బ్యాచ్‌లలో మధ్యప్రదేశ్‌లోని కునా నేషనల్ పార్కుకి తరలించారు అధికారులు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతేడాది సెప్టెంబర్ 17న తన 72వ పుట్టినరోజు సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని కునో వద్ద ఉన్న క్వారంటైన్ ఎన్‌క్లోజర్‌లోకి నమీబియా నుంచి ఐదు ఆడ చీతా పిల్లలు, మూడు మగ చీతా పిల్లలతో కూడి సుమారు ఎనిమిది చీతా పిల్లలను విడుదల చేశారు.