Bhainsa - Image used for representational purpose only - | File Photo

Bhainsa, March 12: నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో రెండు వర్గాల మధ్య చీటికిమాటికి ఘర్షణలు పట్టణంలో ప్రశాంతత లేకుండా చేస్తున్నాయి. కొన్నిసార్లు ఈ అల్లర్ల ప్రభావంతో జరిగే చర్యలు హద్దుమీరుతున్నాయి. భైంసాలో ఓ మైనర్ బాలికపై మరో మైనర్ బాలుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగుచూసింది. నిర్మల్ జిల్లా పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేయగా, నేరుగా రాష్ట్ర డీజీపీ భైంసాలోని పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. బాలికపై లైంగికదాడి కేసుకు సంబంధించిన దర్యాప్తును ప్రతేకంగా పర్యవేక్షించాలని మహిళా భద్రతా విభాగం (డబ్ల్యుఎస్‌డబ్ల్యు)ను స్టేట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎం. మహేంధర్ రెడ్డి ఆదేశించారు.

ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించాలని, కేసుకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలను సేకరించి, నిందితులకు కఠినమైన శిక్ష పడేలా చూడాలని డీజీపీ కోరారు. బాధితురాలికి సరైన చికిత్స అందేలా చూడాలని, బాలిక కుటుంబానికి అన్ని విధాల సహాయం అందించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు.

Bhainsa Updates:

ఇక భైంసాలో జరిగిన గ్రూప్ ఘర్షణలకు సంబంధించి ఇప్పటివరకు 21 కేసులను నమోదు చేశామని, మరియు ఇద్దరు బాలలతో సహా 30 మందిని అరెస్టు చేసినట్లు జిల్లా ఇన్‌చార్జ్ పోలీస్ సూపరింటెండెంట్ విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు ఎంఐఎం కౌన్సిలర్లు కూడా ఉన్నట్లు సమాచారం.

భైంసాలో పరిస్థితులు ప్రస్తుతం అదుపులో ఉన్నాయని, గత నాలుగు రోజులగా పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఎస్పీ తెలిపారు.

భైంసాలో గత ఆదివారం (మార్చి 7) రాత్రి రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలు చెలరేగాయి. అవి పట్టణంలోని దుకాణాలు, ఇతర ఆస్తులు కాల్చివేసేవరకు దారితీశాయి. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఆరాతీశారు. ప్రస్తుతణ్ భైంసా పట్టణంపై జాతీయ స్థాయిలో నిఘా ఉంది.

కాగా, భైంసా పట్టణంలో ప్రస్తుతం  144 సెక్షన్ అమలులో ఉంది. ఇంటర్నెట్ సర్వీసులు ఇప్పటికీ నిలిపివేయబడ్డాయి. భారీ పోలీసు బలగాల పట్టణాన్ని నిరంతరం పహారా కాస్తున్నాయి.