Bhopal, JAN 22: రోడ్లు మంచిగా ఉండటం వల్లనే ప్రమాదాలు (Good Roads For Rise In Accidents) జరుగుతున్నాయి. రోడ్లు బాగోలేకపోతే ఇక ప్రమాదాలకు ఆస్కారమే ఉండదు అని మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA) ఒకరు కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. రోడ్లు అధ్వానంగా ఉంటే వాహనాలు మెల్లగా పోవడం వల్ల ప్రమాదాలు జరగవన్నారు. అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడిపేవారి సంఖ్య పెరుగుతుండటంతో ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయని ఆయన సెలవిచ్చారు. "నా నియోజకవర్గంలో రోడ్లు బాగున్నాయి. అద్దాల్లా మెరుస్తున్నాయి. దాంతో వాహనాలు స్పీడ్‌గావెళ్తూ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నాయి. నాకు కూడా అనుభవమే. కొందరు డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారు. వీరి వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి’ అని బీజేపీ ఎమ్మెల్యే నారాయణ పటేల్ (Narayan Patel) చెప్తుకొచ్చారు.
అధ్వానంగా ఉండే రోడ్ల వల్ల ప్రమాదాలు తక్కువగా జరుగుతాయని మీరు భావిస్తున్నారా అని మీడియా ప్రశ్నించడంతో ఆయన పైవిధంగా స్పందించారు. ఖాండ్వా జిల్లాలోని మంధన అసెంబ్లీ నియోజకవర్గం (Mandhana assembly constituency) నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లో రోడ్ల పరిస్థితి నానాటికి తీసికట్టుగా తయారైందని బీజేపీ ఎమ్మెల్యేలే ఒప్పుకుంటున్నారు. రోడ్డుపై బురదలో నడుచుకుంటూ వచ్చిన ఓ వ్యక్తి కాళ్లను శుభ్రం చేశారో మంత్రి. అంతకుముందు రోడ్లు బాగయ్యేవరకు చెప్పులు ధరించనని భీష్మప్రతిజ్ఞ చేశాడీయన. అనంతరం జ్యోతిరాదిత్య సింధియా జోక్యంతో ఆయన చెప్పులు ధరించాడు. ఒక్క ఖాండ్వా జిల్లాలోనే ఈ ఏడాది ఇప్పటివరకు నాలుగు పెద్ద ప్రమాదాలు జరిగాయి. ఇలాఉండగా, మధ్యప్రదేశ్‌లోని రోడ్లు యూఎస్‌లోని రోడ్ల కంటే మెరుగ్గా ఉన్నాయని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ 2017లో తన అమెరికా పర్యటనలో పేర్కొన్నారు. 2018లో జరిగిన బహిరంగ సభలో కూడా ఆయన తన వాదనను పునరావృతం చేయడం విశేషం.