Bellary, JAN 22: ప్రముఖ సింగర్ మంగ్లీ కారుపై (Singer Mangli’s Car Attacked) రాళ్ల దాడి జరిగింది. కర్ణాటకలోని బళ్లారిలో (Bellary) ఈ దాడి జరిగింది. బళ్లారి మున్సిపల్ కాలేజ్ గ్రౌండ్స్ లో బళ్ళారి ఉత్సవ్ లో (Bellary utstav) పాల్గొన్న మంగ్లీ.. తిరిగి వెళ్తుండగా ఆమె కారుపై దుండగులు రాళ్ల దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఉత్సవ్ కు సీనియర్ నటుడు రాఘవేంద్ర రాజకుమార్, పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంగ్లీతో (Mangli) పాటు పలువురు సింగర్స్ పాల్గొని పాటలు పాడారు. కాగా.. కొన్నిరోజుల క్రితం చిక్కబళ్లాపుర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మంగ్లీ పాల్గొంది. ఆ సమయంలో కన్నడలో మాట్లాడాలని మంగ్లీని యాంకర్ అనుశ్రీ కోరింది. అయితే మంగ్లీ కన్నడలో మాట్లాడలేదు. అంతేకాదు.. పక్కనే ఏపీ ఉందని, అందరికీ తెలుగు వస్తుందని బదులిచ్చింది. అయినా యాంకర్ బలవంతం చేయగా కన్నడలో ఒకటి రెండు మాటలు మాట్లాడింది. ఇక, యాంకర్ కన్నడ భాష తనకు అర్థం కాలేదని మంగ్లీ అంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral video) అవ్వడంతో ఆమెపై కన్నడిగులు మండిపడ్డారు.
మంగ్లీ.. తెలుగు నుంచి కన్నడ సినీ పరిశ్రమకు వచ్చి రెండేళ్లు దాటుతోందని.. ఇంకా కన్నడ అర్థం కావడం లేదా? ఇలాంటి వారికి ఎందుకు కన్నడ సినీ పరిశ్రమ అవకాశాలు ఇస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, తనకు కన్నడ భాష (Kannada) అర్థం కాదని మంగ్లీ అన్న వ్యాఖ్యలతోనే ఆమె కారుపై దాడి జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే.. బళ్లారి ఉత్సవ్ ప్రోగ్రామ్ తర్వాత మంగ్లీని చూసేందుకు చాలా మంది యువకులు మేకప్ టెంట్ లోకి దూసుకెళ్లారు. వెంటనే స్పందించిన పోలీసులు ఆ యువకులను అక్కడి నుంచి చెదరగొట్టారు. దీంతో ఆ యువకులు మంగ్లీ కారు వెళ్తుండగా ఎదురెళ్లారు. మంగ్లీ స్వయంగా పోలీసులను అడ్డం పెట్టి తమను కలవకుండా చేసిందని కోపంతో వారు ఏమైనా రాళ్ల దాడి చేశారా అనే కోణంలోనూ పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.