Heavy Rain Alert: అరేబియా సముద్రంలో అల్పపీడనం, మూడు నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు, ప్రయాణ సమయాలను మార్చుకోండి, బులిటిన్ విడుదల చేసిన ఢిల్లీలోని కేంద్ర వాతావరణశాఖ
Heavy Rain Alert ( Photo Pixabay )

New Delhi, October 18: అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల రాగల మూడు, నాలుగు రోజుల్లో కర్ణాటక సముద్ర తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఢిల్లీలోని కేంద్ర వాతావరణశాఖ బులిటిన్ విడుదల చేసింది. అల్పపీడన ప్రభావం వల్ల శుక్రవారం రాయలసీమ, తెలంగాణ, కేరళ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవవచ్చని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.మత్స్యకారులు అరేబియా సముద్రంలో కొన్నాళ్లపాటు చేపలవేటకు వెళ్లరాదని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.

లక్షదీవుల నుంచి తెలంగాణ వరకు కేరళ, దక్షిణ కర్ణాటక, రాయలసీమ మీదుగా 3.1 కి.మీ నుంచి 5.8 కి.మీ ఎత్తులో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ, ఏపీలో రానున్న 3 రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురువనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో శుక్రవారం, శనివారాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు కూడా తెలిపింది.

లక్షద్వీప్ ప్రాంతంలో అరేబియా సముద్రంలో కేంద్రీకృతమైన అల్పపీడనం వల్ల కర్ణాటక, కొంకణ్ తీర ప్రాంతాల్లో గంటకు 45 నుంచి 55కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. కోస్తా కర్ణాటక, కొంకణ్, గోవా, మధ్యమహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి, కరాయికల్ ప్రాంతాల్లో శుక్రవారం భారీవర్షాలు కురవవచ్చని కేంద్ర వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తర హర్యానా, చంఢీఘడ్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవవచ్చని అధికారులు వివరించారు.

మరోవైపు కోస్తాంధ్రాలోనూ రానున్న 24 గంటల్లో మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా దక్షిణ కోస్తాలో ఒకటి రెండు చోట్ల ఆకాశం మేఘావృత్తమై కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

ఇదిలా ఉంటే తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.వీటి ప్రభావంతో వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది.ఈ అకాల వర్షాలు రైతన్నలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.ముఖ్యంగా కోయంబత్తూరు, నీలగిరి జిల్లాలో అధికంగా వర్షాలు కురుస్తున్నాయి.నీలగిరి జిల్లాలో కొండ చరియలు విరిగిపడ్డాయి. మరో రెండు రోజులపాటు 10 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణశాఖ హెచ్చరికతో అధికా రులు అప్రమత్తమయ్యారు. అదేవిధంగా చెన్నై,తిరున్నల్వేలి,ఊటీ తదితర ప్రాంతాల్లోనూ ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తు న్నాయి.భవానీ డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది.లోతట్టు ప్రాంతా లన్నీ జలమయ్యాయి. నదులు,వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.ఈ వర్షాల ధాటికి జనజీవనం పూర్తిగా స్తంభించిపో యింది.మరో రెండురోజులపాటు భారీవర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.