Heavy Rainfall In Hyderabad GHMC Warning | Photo - PTI

New Delhi, June 1: మండే ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు చల్లని కబురు అందింది. కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు (Monsoon 2020) తాకాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) సోమవారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో నైరుతి రుతుపవనాల వల్ల దేశంలో ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ (India Meteorological Department) వెల్లడించింది.

ఈరోజు కేరళలోకి ప్రవేశించిన రుతుపవనాలకు ఎటువంటి ఆటంకాలు లేవని, దీనివల్ల దేశ వ్యాప్తంగా 102శాతం వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. దీనికి సంబంధించిన వివరాలను జాతీయ వాతావరణ శాఖ(ఐఎండీ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహోపాత్ర మీడియాకు వెల్లడించారు. ముంబైకి మరో పెను ముప్పు, కరోనా వేళ విరుచుకుపడనున్న నిసర్గ తుఫాన్, మొత్తం నాలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్, మత్స్యకారులకు హెచ్చరిక జారీ చేసిన ఐఎండీ

నైరుతి రుతుపవనాల (Southwest Monsoon 2020) వల్ల రాబోయే మూడు రోజుల్లో కేరళ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు 80శాతం ఐఎండీ సెంటర్లు గుర్తించాయి’ అని మహోపాత్ర తెలిపారు. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం గురించి వివరిస్తూ, దాని ప్రభావం కచ్చితంగా నైరుతి రుతుపవనాలపై ఉంటుందని అన్నారు.

అయితే ఆ అల్పపీడనం కూడా జూన్ 3వ తేదీనాటికి భారత్ వైపు మళ్లుతుందని, దీనివల్ల గుజరాత్, మహరాష్ట్ర రాష్ట్రాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. రానున్న 48 గంటల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అందువల్ల మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లవద్దని సూచించామని మహోపాత్ర తెలిపారు.

భూ పరిజ్ఞాన మంత్రిత్వ శాఖ(ఎర్త్ సైన్స్ మినిస్ట్రీ) కార్యదర్శి డాక్టర్ మాధవన్ నాయర్ రాజీవన్ మీడియాతో మాట్లాడుతూ, ఈ ఏడాది రుతుపవనాలకు పూర్తిగా అనుకూలమైన వాతావరణం ఉందని తెలిపారు. జూన్ నుంచి సెప్టెంబరు మధ్యలో దాదాపు 102 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. భారత వార్షిక వర్షపాతంలో ఈ రుతుపవనాల వల్ల 70 శాతం నమోదవుతుందని వివరించారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళలోని 9 జిల్లాలకు ఐఎండీ యల్లో అలర్ట్‌ జారీ చేసింది. తిరువనంతపురం, కొల్లాం, పతనంథిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి, మలప్పురం, కన్నూర్‌ జిల్లాలను అప్రమత్తం చేసింది. మత్స్యకారులు చేపలవేటకు సముద్రంలోకి వెళ్లరాదని అధికారులు పేర్కొన్నారు.

కేరళను తాకిన రుతుపవనాలు చురుగ్గా కదులుతూ దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, బంగాళాఖాతంలోని ఆగ్నేయ ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రుతుపవనాల ప్రభావంతో లక్షదీప్, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఏపీలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.