
నైరుతి రుతు పవనాల రాక మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రుతు పవనాలు కేరళ తీరాన్ని జూన్ 1 తాకాల్సి ఉండగా ఈ తేదీన అవి కేరళను తాకలేదు. ఈ నేపథ్యంలో జూన్ 4న రావొచ్చునని మేలో భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది. కేరళలో రుతుపవనాల ప్రారంభానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ ఒక నవీకరణలో పేర్కొంది.
ఆదివారం రుతు పవనాల జాడ లేకపోవడంతో ఐఎండీ స్పందించింది. ‘అరేబియా సముద్రంపై పశ్చిమ గాలుల ఉధృతి పెరిగింది.ఆగ్నేయ అరేబియా సముద్రంలో మేఘాలు కూడా పెరుగుతున్నాయి. కేరళలో రుతుపవనాల ప్రారంభానికి ఈ అనుకూల పరిస్థితులు రానున్న మూడు నాలుగు రోజుల్లో మరింత మెరుగుపడతాయని మేము భావిస్తున్నాము.దీనిపై నిరంతరం పర్యవేక్షిణ కొనసాగుతోంది, రేపు (సోమవారం) తదుపరి నవీకరణలు అందించబడతాయని IMD ఒక నవీకరణలో పేర్కొంది.
దాదాపు 2.1 కి.మీ ఎత్తున సముద్రంపై మేఘాలు విస్తరించాయి. మూడు లేదా నాలుగు రోజుల్లో నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకొచ్చు’ అని ఒక ప్రకటనలో పేర్కొంది. రుతు పవనాలు ఆలస్యం కావటం ఖరీఫ్ సీజన్, దేశవ్యాప్తంగా వర్షపాతంపై ప్రభావం చూపుతుందని వాతావరణ నిపుణులు అభిప్రాయపడ్డారు. దేశం యొక్క మొత్తం ఆహార ఉత్పత్తిలో 40 శాతం రుతుపవనాలపై ఆధారపడి ఉంది, ఇది భారతదేశ ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో కీలక పాత్ర పోషిస్తుంది.
నైరుతి రుతుపవనాలు సాధారణంగా ఏడు రోజుల ప్రామాణిక విచలనంతో జూన్ 1 నాటికి కేరళకు వస్తాయి. రుతుపవనాలు గత ఏడాది మే 29న, 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న, 2019లో జూన్ 8న, 2018లో మే 29న కేరళకు చేరుకున్నాయి.