New Delhi, June 7: వాతావరణ ప్రభావం వల్ల ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఇంకా దేశంలోకి ప్రవేశించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో భారత వాతావరణ విభాగం (India Meteorological Department-IMD) శుభవార్త చెప్పింది. మరో 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు (South West Mansoon) కేరళ తీరాన్ని తాకనున్నాయని ప్రకటించింది. కేరళను తాకిన తర్వాత అన్ని ప్రాంతాలకు మాన్‌సూన్ విస్తరించనుందని తెలిపింది.
రుతుపవనాల రాకకు దక్షిణ అరేబియా సముద్రం, లక్షద్వీప్, వాయువ్య, ఈశాన్య బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. రానున్న 48 గంటల్లో ఇవి కేరళ తీరాన్ని తాకే అవకాశముందని వాతావరణ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా ఏప్రిల్ నెల పూర్తిగా, మే నెల మొదటి వారంలో ఎండలు పెద్దగా లేకపోయినా తర్వాత క్రమంగా ఎండల తీవ్రత పెరిగింది. మే ఆఖరి వారం నుంచి ఇప్పటివరకు (జూన్ మొదటి వారం) నిత్యం 40 డిగ్రీల కంటే పైనే పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ముంచుకొస్తున్న బైపార్జోయ్ తుఫాను ముప్పు, అరేబియా సముద్రంలో 24 గంటల్లో ఏర్పడనున్న అల్పపీడనం
గతేడాది జూన్ 1నే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకగా.. ఈ ఏడాది ఆ తేదీ నాటికి కనీసం శ్రీలంకను కూడా దాటలేదు. వాతావరణ మార్పుల కారణంగా ఈ సారి రుతుపవనాల రాక ఆలస్యమవుతోంది. తొలుత జూన్ 4 నాటికి తీరం తాకొచ్చని అంచనా వేసినా.. 7వ తేదీ వచ్చినా రుతుపవనాల ఆచూకీ కన్పించట్లేదు. ఇప్పుడు తుపాను ప్రభావంతో అరేబియా సముద్రంలో రుతుపవనాల కదలికలు బలహీనంగా ఉన్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. రుతుపవనాల ఆలస్యంతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ వానాకాలంలో వర్షపాతం అయిదు శాతం వరకూ తగ్గవచ్చని అంచనా. తాజాగా తొలకరి పలకరించనుందంటూ ఐఎండీ తీపి కబురు చెప్పింది.
ANI Video
The India Meteorological Department (IMD) says that conditions are becoming favourable for the onset of Monsoon over Kerala in the next 48 hours
Visuals from Thiruvananthapuram pic.twitter.com/mt39xiu1rQ
— ANI (@ANI) June 7, 2023
అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్ తుపాను వేగంగా బలపడుతోంది. తీవ్ర తుపానుగా మారిన బిపోర్‌జాయ్.. బుధవారం ఉదయం 5.30 గంటలకు గోవాకు 890 కిలోమీటర్ల దూరంలో పశ్చిమాన - నైరుతి ప్రాంతంలో, ముంబయికి 1,000 కిలోమీటర్ల దూరంలో నైరుతిలో, పోర్‌బందర్‌కు 1,070 కిలోమీటర్ల దూరంలో దక్షిణాన - నైరుతిలో, కరాచీకి 1,370 కిలోమీటర్ల దూరంలో దక్షిణాన కేంద్రీకృతమై ఉంది. రాగల మూడు రోజుల్లో ఇది ఉత్తరాన - వాయువ్య దిశలో కదిలే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
అయితే, ఈ తుపాను కారణంగా అరేబియా తీర ప్రాంతాలకు ఎలాంటి పెను ముప్పు లేదని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సముద్రంలోకి ఎవరూ వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు.