New Delhi, June 28: కొత్త పార్లమెంట్ భవనంలో తొలిసారిగా మాన్‌సూన్ సెషన్ జరుగనుంది.జూలై 17 నుంచి వర్షాకాల సమావేశాలు జరుగనున్నట్లుగా సంబంధిత వర్గాలు వెల్లడించాయి.ఈ సమావేశాలు జూలై 17 నుంచి ఆగస్టు 10 వరకు జరుగునున్నాయి. శీతాకాల సమావేశాల్లో భాగంగా ఢిల్లీ పరిపాలనాధికారాల బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. అలాగే, ఉమ్మడి పౌరస్మృతిపై వాడీవేడి చర్చ జరిగే అవకాశం ఉంది. మరోవైపు.. సాధారణ ఎన్నికలకు ముందు ఇవే చివరి వర్షాకాల సమావేశాలు కానున్నాయి.
అయితే సమావేశాల తేదీలను అధికారికంగా ప్రకటించనప్పటికీ.. జులై 17 లేదా 20వ తేదీన సమావేశాలు ప్రారంభమవుతాయని, ఆగస్టు 10న ముగియవచ్చని తెలిపాయి. కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh) అధ్యక్షతన ఏర్పాటు చేసిన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఒకటి రెండు రోజుల్లో తేదీలను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెల రోజులక్రితం కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించినప్పటికీ.. అందులో ఇంకా కొన్ని పనులు కొనసాగుతున్నాయి. కొత్త పార్లమెంటు భవనం సమావేశాలను నిర్వహించడానికి పూర్తిగా సిద్ధం కాకపోతే.. పాత భవనంలోనే వర్షాకాల సమావేశాలు జరిగే అవకాశం ఉండొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.