Srinagar, SEP 16: ఆమె ముగ్గురు పిల్లలకు తల్లి. తొమ్మిదో తరగతి వరకు చదివింది. తప్పనిసరి పరిస్థితుల్లో చదువు మధ్యలోనే ఆపి పెండ్లి చేసుకోవాల్సి వచ్చింది. కుటుంబ బాధ్యతలు మోస్తూనే ప్రైవేటుగా పదో తరగతి చదువుతున్నది. ఉన్నత విద్య అభ్యసించేలానే తన కోరికకు పట్టుదల తోడవడంతో పదో తరగతి ద్వై వార్షిక పరీక్షల్లో (10 Bi-Annual Exams) క్లాస్ టాపర్‌గా నిలిచింది. వివిధ కారణాలతో చదువును మధ్యలోనే ఆపేసిన ఎంతోమందికి స్ఫూర్తిని నింపిన ఆమె జమ్ముకశ్మీర్‌కు (Jammu kashmir) చెందిన సబ్రినా ఖలిక్ (Sabrina Khaliq). కుప్వారా జిల్లాకు చెందిన సబ్రినాకు తొమ్మిదో తరగతి పూర్తయిన తర్వాత వివాహమయింది. ప్రస్తుతం ఆమెకు ఇద్దరు అమ్మాయిలు, ఓ కూతురు. భర్త, పిల్లలు, కుటుంబ బాగోగులు చూసుకోవడంతో ఇన్నాళ్లు గడిపింది. అయితే గతేడాది ఆమెకు మధ్యలో ఆపిన తన చదువులను కొనసాగించాలనే కోరిక కలింది. ఇదే విషయాన్ని భర్త, అత్తామామలకు చెప్పింది. వారు ఒప్పుకోవడంతో ప్రైవేటుగా పదో తరగతి చదువుతున్నది.
కుటుంబ బాగోగులు చూస్తూనే రోజూ రెండు గంటలు చదువుకు కేటాయించింది. ఎలాగైనా పది పాసవ్వాలనే పట్టుదలతో ప్రిపేరవుతూ వచ్చింది. గత నెలలో జరిగిన జమ్ముకశ్మీర్ బోర్డ్ బై యాన్యువల్ (10 Bi-Annual Exams) ఎగ్జామ్స్‌లో 93.4 శాతం మార్కులతో క్లాస్ టాపర్‌గా నిలిచింది. మొత్తం 500 మార్కులకు 467 స్కోర్ చేసింది. మ్యాథ్స్, ఉర్దూ, సైన్స్, సోషల్‌లో ఏ1 గ్రేడ్ సొంతం చేసుకుంది.
తాను రాత్రి వేళల్లోనే ఎక్కువగా చదివేదానినని ఖలిక్ తెలిపారు. చదువులో తనకు భర్త, అక్కా చెల్లెల్లు చాలా సహాయం చేశారని చెప్పారు. తాను ముగ్గురు పిల్లల తల్లిని అయినప్పటికీ క్లాస్ టాపర్‌గా (topper) నిలవడం చాలా గర్వంగా ఉందని పేర్కొన్నారు. కలలు కనడం మానొద్దని, వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడాలని ఖలిక్ సూచించారు.