Hyderabad, SEP 16: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే విమోచన అమృతోత్సవ్ వేడుకల్లో (Hyderabad Liberation Day) పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amith shah) హైదరాబాద్ రానున్నారు. ఇవాళ రాత్రి 10గంటల సమయంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నఅమిత్ షా.. రాత్రి పోలీస్ అకాడమీలో బస చేస్తారు. 17వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో బీజేపీ తలపెట్టిన తెలంగాణ విమోచన దినోత్సవానికి ముఖ్యఅతిథిగా అమిత్ షా హాజరవుతారు. విమోచన దినోత్సవం రోజంతా హైదరాబాదులోనే ఉంటూ వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. 17న ఉదయం సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో (parade grounds) జరిగే సభకు అమిత్ షా హాజరువుతారు. ఉదయం 8.45 గంటల నుంచి 11.45 గంటల వరకు అమిత్ షా అక్కడే ఉంటారు.
విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేస్తారు. సభ అనంతరం పరేడ్ గ్రౌండ్ నుంచి బేగంపేట టూరిజం ప్లాజాకు బయలుదేరుతారు. టూరిజం ప్లాజాలో బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీతో సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్స్‌కు అమిత్ షా చేరుకుంటారు. అక్కడ మోదీ పుట్టిన రోజు సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించనున్న కార్యక్రమంలో పాల్గొని వికలాంగులకు సహాయక ఉపకరణాలను పంపిణీ చేస్తారు. కార్యక్రమం అనంతరం తిరిగి రాజేంద్ర నగర్ పోలీస్ అకాడమీకి చేరుకుంటారు.
అక్కడ పలు కార్యక్రమాల్లో అమిత్ షా పాల్గొంటారు. రాత్రి 7.30 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. ఈ టూర్‌లోనే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ను (Prabhas) కలువనున్నారు అమిత్ షా. ఇటీవల మరణించిన కృష్ణంరాజు కుటుంబాన్ని ఆయన పరామర్శించే అవకాశం ఉంది.