UK, Sep 15: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మళ్లీ కొత్త వేరియంట్ (New COVID Variant) ప్రపంచదేశాలను హడలెత్తిస్తోంది. కోవిడ్‌లో ఒమిక్రాన్ బీఏ.4.6 (Omicron BA.4.6 variant) అనే కొత్త వేరియంట్ అమెరికా, యూకేలతో పలు దేశాల్లో (Spreading In US And UK) విస్తరిస్తోంది. దీంతో, పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.యూకేలో సేకరించిన మొత్తం నమూనాల్లో 3.3% ఈ రకాలే ఉన్నట్లు యూకే ఆరోగ్య భద్రతా సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. తాజాగా ఈ సంఖ్య 9 శాతానికి చేరినట్టు అధికారులు వెల్లడించారు.
ఇక అమెరికాలో ఈ వేరియంట్ కేసులు 9 శాతానికి పైగానే నమోదు అవుతున్నట్టు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ తెలిపింది. ఈ రెండు దేశాల్లోనే కాకుండా ఇతర దేశాల్లో సైతం కొత్త వేరియంట్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే ఒమిక్రాన్ బీఏ.4.6 కూడా బీఏ.4 లాంటిదేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అయితే, కొత్త వేరియంట్.. టీకాలు తీసుకున్న వారిపై కూడా అటాక్ చేస్తుంది. ఒమిక్రాన్‌లోని ఇతర వేరియంట్ల మాదిరిగానే దీనివల్ల కూడా వ్యాధి తీవ్రత, మరణాలు సంభవించే అవకాశాలు తక్కువని వైద్యులు స్పష్టం చేశారు. కాగా, ఈ ఏడాది జనవరిలో బీఏ.4 వేరియంట్ ఆఫ్రికాలో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత బీఏ.5 వేరియంట్ ప్రపంచ దేశాల్లో వ్యాప్తిచెందింది.