Delhi Metro | Representational Image (Photo Credits: PTI)

New Delhi, September 7: దేశ‌వ్యాప్తంగా ప‌లు ప్రధాన న‌గ‌రాల్లో మెట్రో రైలు స‌ర్వీసు సేవ‌లు తిరిగి ప్రారంభం (Metro Resumes Operations) అయ్యాయి. 169 రోజుల త‌ర్వాత ఢిల్లీ మెట్రో సర్వీసులు పునరుద్ధిరించబడ్డాయి. మార్చిలో విధించిన లాక్‌డౌన్ (COVID-19 Lockdown) నుంచి మెట్రో స‌ర్వీసులు బంద్ అయిన విషయం విదితమే. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో ప‌లు న‌గ‌రాల్లోని మెట్రో స‌ర్వీసుల‌న్నీ ర‌ద్దు అయ్యాయి. అయితే అన్‌లాక్‌4 ద‌శ‌లో భాగంగా నేటి నుంచి ఢిల్లీ, నోయిడా, ల‌క్నో, బెంగుళూరు, చెన్నై, కొచ్చి, హైద‌రాబాద్ న‌గ‌రాల్లో మెట్రో స‌ర్వీసులు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి.

ఢిల్లీలో ప్రస్తుతం ఎల్లో లైన్‌లో స‌ర్వీసులు (Delhi Metro Resumes Operations) న‌డుస్తున్నాయి. స‌మ‌య్‌పుర్ బ‌ద్లీ నుంచి హుడా సిటీ వ‌ర‌కు ఉద‌యం 7 గంట‌ల నుంచి 11 గంట‌ల వ‌ర‌కు, ఆ త‌ర్వాత సాయంత్ర 4 నుంచి 8 వ‌ర‌కు మెట్రో స‌ర్వీసులు న‌డుస్తాయి. గురుగ్రామ్‌లోని హుడా సిటీ సెంట‌ర్ నుంచి హ‌ర్యానాలోని స‌మ‌య్‌పుర్ బ‌ద్లీ మెట్రో స్టేష‌న్‌కు తొలి రైలు క‌దిలింది. కేవ‌లం స్మార్ట్ కార్డు ద్వారానే ఎంట్రీ ఉంటుంది.

Visuals from Huda City Centre Metro Station in Gurugram:  

నోయిడా మెట్రో రైల్ కార్పొరేష‌న్ కూడా స‌ర్వీసుల‌ను ప్రారంభించింది. అక్వా లైన్‌లో మెట్రో ప‌రుగులు తీస్తున్న‌ది. మెట్రో స‌ర్వీసులు ప్రారంభ‌మైన నేప‌థ్యంలో ఢిల్లీ మెట్రో ప్ర‌యాణికుల‌కు స్వాగ‌తం ప‌లికింది. త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో డీఎంఆర్‌సీ కొన్ని పోస్టులు చేసింది. బాధ్య‌తాయుతంగా ప్ర‌యాణం చేయాల‌ని, అవ‌స‌రం అయితేనే ప్ర‌యాణం చేయాలంటూ త‌న ట్వీట్‌లో కోరింది. స‌ర్వీసులు ప్రారంభం అయినా.. కంటేన్మెంట్ జోన్ల‌లో మాత్రం రైలు ఆగ‌దు.

Police force deployed at every station for crowd management:  

ల‌క్నోలోనూ మెట్రో స‌ర్వీసులు ఇవాళ ఉద‌యం ఏడు నుంచి ప్రారంభం అయ్యాయి. కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ మెట్రో ప్ర‌యాణికుల‌కు ఎంట్రీ క‌ల్పిస్తున్నారు. మెట్రో స్టేష‌న్ల‌లో ప్ర‌యాణికుల‌కు టెంప‌రేచ‌ర్ చెక్ చేస్తున్నారు. స్మార్ట్‌కార్డు ఉన్న వారినే లోనికి పంపిస్తున్నారు. బుకింగ్ వ‌ద్ద టికెట్లు ఇవ్వ‌డం లేదు. బెంగుళూరులోనూ మెట్రో సేవ‌లు ప్రారంభం అయ్యాయి. ప‌ర్పుల్ లైన్‌లో మెట్రో ప‌రుగులు తీస్తున్న‌ది. ఉద‌యం 8 నుంచి 11 వ‌ర‌కు, సాయంత్రం 4.30 నుంచి 7.30 వ‌ర‌కు ప్ర‌తి అయిదు నిమిషాల‌కు ఒక స‌ర్వీసు ఉంటుందని అధికారులు చెప్పారు.

నేటి నుంచి హైదరాబాద్‌లో మెట్రో పరుగులు

నేటి నుంచి హైదరాబాద్ నగరంలో కూడా మెట్రో సేవలు (HYD Metro Resumes Operations) ప్రారంభం అయ్యాయి. మెట్రో సేవలను దశలవారీగా అందుబాటులోకి తెచ్చేందుకు రెండు, మూడు రోజులుగా హైదరాబాద్‌ మెట్రో రైలు, ఎల్‌ అండ్‌ టీ మెట్రో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కొవిడ్‌-19 నిబంధనలను కచ్చితంగా పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. మెట్రో రైళ్లు, మెట్రో స్టేషన్లలో శానిటైజేషన్‌తో పాటు, ప్రయాణికుల మధ్య భౌతిక దూరం, టికెట్ల కోసం కౌంటర్ల వద్దకు వెళ్లకుండానే ఆన్‌లైన్‌ ద్వారా క్యూఆర్‌ కోడ్‌ టిక్కెట్‌, స్మార్ట్‌ కార్డు వినియోగం చేసేలా ఏర్పాట్లు చేశారు. పూర్తిగా ఏసీతో కూడిన మెట్రో రైళ్లలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందడకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Hyderabad metro services resume Operations

మెట్రో రైళ్లలో ఇంతుకుముందులా వెయ్యి మందికి వరకు ప్రయాణించే అవకాశం లేదు. భౌతిక దూరం నిబంధన నేపథ్యంలో సీట్ల మధ్య దూరం పాటిస్తూ నిలబడి నప్పుడు ప్రయాణికులు దూరం ఉండేలా మెట్రో రైళ్లలోనూ మార్కింగ్‌ చేయనున్నారు. ఈ మేరకు ఒక్కో రైల్లో 300 మంది ప్రయాణించకుండా చర్యలు తీసుకున్నారు. మెట్రో రైళ్లు, స్టేషన్‌లలో ఉన్న సీసీ టీవీ కెమెరాల ద్వారా ఎక్కడ ఎలాంటి పరిస్థితి ఉందనే విషయాన్ని ఉప్పల్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, ఆయా మెట్రో స్టేషన్‌ల ఇంచార్జిలు పర్యవేక్షణ చేయనున్నారు.

మెట్రో రైళ్లు మొదటి రోజు కేవలం కారిడార్‌-1లో మియాపూర్‌ నుంచి ఎల్బీనగర్‌ మధ్యనే తిరుగుతాయి. ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు, తిరిగి సా.4 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా సేవలు అందించనున్నాయి. ఈ కారిడార్‌లో ఉన్న మూసాపేట, భరత్‌నగర్‌ మెట్రో స్టేషన్లలో రైళ్లను నిలిపే అవకాశం లేదని మెట్రో అధికారులు ఇప్పటికే ప్రకటించారు. 8వ తేదీన కారిడార్‌-2లో, 9వ తేదీ నుంచి మాత్రం మూడు కారిడార్‌లలో ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు పూర్తి స్థాయిలో మెట్రో రైళ్లను నడిపేలా కార్యచరణ సిద్ధం చేశారు. రెండు రోజుల ముందు నుంచే ట్రయల్‌రన్స్‌ను నిర్వహించారు. సిగ్నలింగ్‌, ఇతర సాంకేతిక వ్యవస్థలను, మెట్రో స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షించారు.