Mumbai, Sep 14: దేశ ఆర్థిక రాజధానిలో ముంబయిలో గల ఛత్రపతి శివాజీ మహరాజ్ విమానాశ్రయం (Mumbai Airport)లో ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖపట్నం నుంచి ముంబయికి బయల్దేరిన వీఎస్‌ఆర్ వెంచర్స్‌కు చెందిన ఓ ప్రైవేటు బిజినెస్ విమానం (Learjet 45) ల్యాండ్ అవుతుండగా రన్‌వేపై జారి పక్కకు దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో విమానంలో ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు.
ఈ ఘటనలో విమానం దెబ్బతినగా, పైలట్లు సహా ముగ్గురికి గాయాలైనట్లు సహాయక చర్యల సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం ముంబయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, 700 మీటర్లకు మించి దృశ్యగోచరత లేదని డీజీసీఏ వెల్లడించింది. విమానాశ్రయంలో గల రన్‌వే 27పై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటన నేపథ్యంలో రన్‌వేను కొద్దిసేపు మూసేశారు. ఆ సమయంలో డెహ్రాదూన్ నుంచి ముంబయికి చేరుకోవాల్సిన విస్తారా విమానాన్ని గోవాలోని మోపా విమానాశ్రయానికి మళ్లించారు. సహాయక చర్యల అనంతరం రన్‌వే కార్యకలాపాలను పునరుద్ధరించారు.