Mumbai, June 9:దేశ ఆర్థిక రాజధాని ముంబైని రుతుపవనాలు తాకాయి. ఈరోజు ఉదయం నుంచి నగరంలో భారీ వర్షం కురుస్తోంది. ఫలితంగా పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. నగరంలోని పలు ప్రాంతాలను భారీ వాన ముంచెత్తుతోంది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
పలు రైల్వే ట్రాక్‌లు నీటమునిగాయి. వచ్చే 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. మరో ఐదు రోజుల పాటు ముంబైకి భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలుస్తోంది. భారీ వర్షాలతో కొంకణ్ తీర ప్రాంతాలు వణికిపోతున్నాయి. థానే, రాయ్‌గఢ్, పుణె, బీడ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఈ సందర్భంగా ముంబై వాతావరణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జయంత్ సర్కార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూన్ 10 నాటికి రుతుపవనాలు ముంబైకి చేరుకునేవని, అయితే ఈసారి ఒకరోజు కంటే ముందే ప్రవేశించాయని తెలిపారు.
ముంబైలో భారీ వర్షాలు కురిసినప్పుడల్లా నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో మోకాళ్లలోతు వరకు నీరు నిలిచిపోయి పలు సమస్యలు తలెత్తుతుంటాయి. కాగా రాబోయే కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో రుతుపవనాలు చురుకుగా కదిలే అవకాశాలున్నాయి. వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం జూన్ 10 తరువాత ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లలో భారీ వర్షాలు కురియనున్నాయి.