Hyderabad, June 8: రాగల రెండు మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు (southwest monsoon) పూర్తిగా ప్రవేశించే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Department) తెలిపింది. ఈనెల 11న ఏర్పడబోయే అల్పపీడన ప్రభావంతో మూడు రోజుల పాటు రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురియడంతో పాటు, ఉత్తర, తూర్పు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు.
నిన్న మరట్వాడా నుంచి ఉత్తర కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల వరకు ఉన్న ద్రోణి ఈరోజు బలహీనపడిందని వెల్లడించారు. ఈరోజు కిందిస్థాయి గాలులు పశ్చిమ దిశ నుంచి రాష్ట్రంలోకి వస్తున్నాయన్నారు. ఏపీలో రాగల 24 గంటల్లో ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాలు, రాయలసీమలో మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు రానున్న పది రోజుల్లో ఒడిశా, ఝార్ఖండ్, బిహార్, పశ్చిమ బెంగాల్ వైపు కదలనున్నాయని శనివారం భారత వాతావరణ విభాగం తెలిపింది.
బంగాళాఖాతంలో (Bay of Bengal) జూన్ 11వ తేదీన అల్పపీడనం ఏర్పడనుందని, ఆ కారణంగా జూన్ 15న ఆ రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయని పేర్కొంది. అయితే 7,8 తేదీల్లో ఎక్కడా వర్షాలు కురవకపోవచ్చని తెలిపింది. రానున్న అయిదు రోజుల్లో ఎక్కడా వేడిగాలులు ఉండకపోవచ్చని కూడా వివరించింది.
నైరుతి రుతుపవనాల ఆగమనంతో వాతావరణంలో మార్పులు ఏర్పడుతున్నాయని, పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నట్లు తెలిపింది. ఈనెల 6వ తేదీన నైరుతి మధ్యప్రదేశ్ నుంచి మరట్వాడా, తెలంగాణ, రాయలసీమ మీదగా ఉత్తర తమిళనాడు వరకు ఏర్పడిన ఉపరితలద్రోణి సోమవారం బలహీనపడినట్లు తెలిపారు.
సోమవారం ఏర్పడిన ఉపరితలద్రోణి మరట్వాడా నుంచి ఉత్తర కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల దూరం వరకు వ్యాపించినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.