New Delhi, June 13: నేషనల్ హెరాల్డ్ కేసులో (National Herald Case) ఈడీ ఎదుట కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమవారం విచారణకు హాజరయ్యారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మూడు గంటలపాటు ప్రశ్నించింది. నేషనల్ హెరాల్డ్ కేసుపై దర్యాప్తులో భాగంగా ఈడీ ఆయనకు (Rahul Gandhi) సమన్లు జారీ చేసింది. దీంతో రాహుల్ గాంధీ పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా సోమవారం ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఈడీ అధికారులు ఆయనను సుమారు మూడు గంటల పాటు ప్రశ్నించారు.
అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్, యంగ్ ఇండియా లిమిటెడ్‌తో రాహుల్‌కు సంబంధాలు, ఆయన పేరుపై ఉన్న షేర్ల వివరాలు, గత షేర్ హోల్డర్లతో సంబంధాలు, సమావేశాలు, యంగ్ ఇండియాకు కాంగ్రెస్ రుణాలు, నేషనల్ హెరాల్డ్ పునరుద్ధరణపై కాంగ్రెస్ నిర్ణయం, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్, నేషనల్ హెరాల్డ్ ఆస్తులు, నిధుల బదిలీల వివరాలను ఈడీ అడిగినట్లు సమాచారం. కాగా, మూడు గంటల ఈడీ విచారణ తర్వాత రాహుల్ గాంధీ ఆ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు.
అనంతరం కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరోవైపు సత్యాగ్రహ ర్యాలీలో పాల్గొన్న అధిర్ రంజన్ చౌదరి, కేసీ వేణుగోపాల్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తదితర కాంగ్రెస్ సీనియర్ నేతలతోపాటు పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్‌కు తరలించిన కాంగ్రెస్ సీనియర్ నేతలను కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కలిశారు. అయితే కాంగ్రెస్ ఎంపీ అధిర్ చౌదరి, కేసీ వేణుగోపాల్‌పై పోలీసులు చేయి చేసుకోవడంపై వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రివిలేజ్ మోషన్ ప్రవేశ పెడతామని ఆ పార్టీ నేత తెలిపారు.
ఈడీ ఎదుట రాహుల్ గాంధీ విచారణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతల నిరసన ప్రదర్శనలను పోలీసులు అడ్డుకున్నారు. అరెస్టయిన నేతల్లో రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లోత్, లోక్‌సభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, హరీష్ రావత్, రణ్‌దీప్ సింగ్ సుర్జీవాలా, అధీర్ రంజన్ చౌధరి, కేసీ వేణుగోపాల్, దీపేందర్ సింగ్ హుదా, పవన్ ఖేరా తదితరులున్నారు. మోదీ సర్కార్ ఒత్తిడికి కాంగ్రెస్ తలవంచదని పవన్ ఖేరా పేర్కొన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాలని రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు దర్యాప్తు ఏజెన్సీ సమన్లు జారీ చేసింది. ఇక సోమవారం మూడు గంటలకు పైగా రాహుల్‌ను ఈడీ ప్రశ్నించగా, జూన్ 23న ఈడీ ఎదుట సోనియా గాంధీ హాజరు కానున్నారు.
నేషనల్ హెరాల్డ్ కేసు ఏంటీ ?
స్వాతంత్ర్యోద్యమ సమయంలో, 1938లో జవహర్ లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభ భాయ్ పటేల్ ఆధ్వర్యంలో 'నేషనల్ హెరాల్డ్' పత్రికను స్థాపించారు. అప్పట్లో తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారనే ఉద్దేశంతో 1942లో దీనిపై బ్రిటీష్ ప్రభుత్వం నిషేధం విధించింది. తర్వాత 1945లో పత్రిక తిరిగి ప్రారంభమైంది. ఆ సమయంలో పత్రిక నష్టాల్లో ఉండేది. దీంతో పత్రిక నడిచేందుకు కాంగ్రెస్ పార్టీ ఆర్థిక సాయం చేసింది. అప్పటినుంచి అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) ఆధ్వర్యంలో పత్రిక సాగేది. అనేక అవాంతరాలు ఎదుర్కొంటూ సాగిన పత్రిక 2008లో తిరిగి మూతపడింది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీకి పత్రిక నిర్వహణా సంస్థ అయిన ఏజేఎల్ రూ.90 కోట్లు బాకీ పడింది.
ఈ సంస్థ ఆస్తులు, బకాయిలపై కాంగ్రెస్ దృష్టి సారించింది. ఇదే సమయంలో 2010లో 50 లక్షల మూలధనంతో 'యంగ్ ఇండియన్ లిమిటెడ్ (వైఐఎల్)' అనే కంపెనీని కాంగ్రెస్ నేతలు స్థాపించారు. ఇందులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చెరో 38 శాతం (మొత్తం 76 శాతం) వాటా కలిగి ఉన్నారు. వీరితోపాటు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండేజ్, శ్యామ్ పిట్రోడా, సుమన్ దూబేలు మిగతా 24 శాతం వాటా కలిగి ఉన్నారు. ఏజేఎల్ బకాయిలు తీర్చడానికి ఈ సంస్థను సోనియా, రాహుల్ వాటా కలిగి ఉన్న వైఐఎల్ సంస్థకు విక్రయించారు. ఈ కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగాయని, ఏజేఎల్ ఆస్తులు దక్కించుకునేందుకు కాంగ్రెస్ మోసపూరితంగా వ్యవహరించిందని ఆరోపణలొచ్చాయి. దాదాపు 2,000 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగాయని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు.
ఆయన ఈ అంశంపై కోర్టులో ఫిర్యాదు చేశారు. 2014లో ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. దీనిపై అప్పట్లోనే స్టే తెచ్చుకున్నారు. ఈ సంస్థకు సంబంధించిన రూ.64 కోట్లను 2019లో ఈడీ అటాచ్ చేసింది. అలాగే తమపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ సుప్రీంకోర్టును సోనియా గాంధీ ఆశ్రయించారు. అప్పట్నుంచి సాగుతున్న ఈ కేసులో తాజాగా సోనియా, రాహుల్‌లకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ సంస్థ ఆస్తుల విలువ దాదాపు రూ.5 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా.