New Delhi, Mar 23: ప్రపంచ దేశ రాజధానుల్లో అత్యంత కలుషిత నగరంగా ఢిల్లీ నిలిచింది. ప్రపంచ నగరాల్లో వాయునాణ్యతను పరిశీలించి స్విస్ సంస్థ ఐక్యూ ఎయిర్ తయారు చేసే జాబితాలో అత్యంత అధమ వాయు నాణ్యత ఉన్న టాప్ 100లో 63 నగరాలు భారత్‌లోనే ఉన్నాయి. వీటిలో సగానికి పైగా నగరాలు ఉత్తరాదిన ఢిల్లీ పరిసరాల్లోనే ఉండటం గమనార్హం. అత్యంత కలుషిత రాజధానిగా ఢిల్లీ టాప్ ప్లేస్‌లో ఉండటం వరుసగా ఇది నాలుగోసారి. ప్రపంచ టాప్ 15 కలుషిత నగరాల్లో పది నగరాలు భారత్‌లోనే ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా 117 దేశాల్లోని 6475 నగరాలు/పట్టణాలు/ప్రాంతాల్లో వాయునాణ్యతను పరిశీలించిన స్విస్ పొల్యూషన్ టెక్నాలజీ కంపెనీ ‘ఐక్యూ ఎయిర్’ మంగళవారం ‘ప్రపంచ వాయునాణ్యత నివేదిక’ను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం 2021లో మొదటి 5 స్థానాల్లో ఉన్న అత్యంత కాలుష్య దేశాలు వరుసగా.. బంగ్లాదేశ్, చాద్, పాకిస్థాన్, తజికిస్థాన్, భారత్. ప్రపంచంలో ఏ దేశమూ డబ్ల్యూహెచ్‌వో సూచించిన ప్రమాణాలను అందుకోలేదని ఐక్యూ ఎయిర్ పరిశీలనలో వెల్లడైంది. వాయునాణ్యత ఘోరంగా ఉండి, కాలుష్య కాసారాలుగా మారిన టాప్-100 ప్రాంతాల్లో 63 భారతీయ నగరాలు/పట్టణా లు ఉన్నట్టు తేలింది.
ఆ 63 నగరాల్లో సగానికన్నా ఎక్కువ హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోనివే కావడం గమనార్హం. వాటిలో టాప్-3లో ఉన్న నగరాలు భివాడీ(రాజస్థాన్), ఘజియాబాద్ (ఉత్తరప్రదేశ్), ఢిల్లీ. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఈ జాబితాలో 5 నగరాలు/పట్టణాలు ఉన్నా యి. ప్రపంచ వాయు నాణ్యతా నివేదిక 2021 ప్రకారం భారత్‌లో అత్యంత కలుషిత నగరాల జాబితాలో ఢిల్లీ, కోల్‌కతా, ముంబై తర్వాత హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది.