Patna, April 28: దేశంలో కొవిడ్-19 మళ్లీ విజృంభిస్తోంది. పలు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. చాలా రాష్ట్రాల్లో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో మాస్కు తప్పనిసరిగా ధరించాలని ఆదేశాలు జారీ చేశాయి. మాస్క్ ధరించకుంటే జరిమానా తప్పదని హెచ్చరించాయి. ఈ పరిస్థితులు ఇలా ఉంటే బీహార్ ఆరోగ్య శాఖ అధికారులు కరోనా కొత్త సబ్ వేరియంట్‌ను (New Omicron sub-variant) గుర్తించారు.
ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (IGIMS)లో ఈ కొత్త వేరియంట్ బీఏ.12 (New Variant BA.12) బయటపడింది. ఇది కరోనా థర్డ్ వేవ్‌లో వెలుగుచూసిన బీఏ.2 సబ్ వేరియంట్‌కంటే పదిరెట్లు ప్రమాదకరమని అధికారులు చెబుతున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మేము కరోనా ఒమిక్రాన్ వేరియంట్ జీనోమ్ సీక్వెన్సింగ్ చేశాం. 13 శాంపిళ్లను పరీక్షించాం. అందులో ఒకటి బీఏ.12 సబ్ వేరియంట్‌గా గుర్తించాం.
మిగతా 12 శాంపిళ్లు బీఏ.2 సబ్ వేరియంట్’ (BA.2) అని మైక్రోబయాలజీ డిపార్ట్‌మెంట్ హెచ్‌వోడీ ప్రొఫెసర్ డాక్టర్ నమ్రతా కుమారి వెల్లడించారు. ఇది బీఏ.2కంటే పదిరెట్లు ప్రమాదకరమని తెలిపారు. అయినా, ఆందోళన చెందాల్సిన పనిలేదని, తగి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బీఏ.12 సబ్ వేరియంట్‌ను మొదట యూఎస్‌లో గుర్తించారు. ఢిల్లీలో ఈ సబ్‌వేరియంట్‌కు సంబంధించిన మూడు కేసులు పాట్నాలో వెలుగుచూశాయి.