Lucknow, June 04: నవ దంపతులు పెళ్లైన మరునాడే గుండెపోటుతో మరణించారు (Newly married couple dies of heart attack). దీంతో ఆ కొత్త జంట మృతదేహాలను ఒకే చితిపై ఉంచి అంత్యక్రియలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 22 ఏళ్ల ప్రతాప్ యాదవ్, 20 ఏళ్ల పుష్పకు మే 30న మంగళవారం రాత్రి పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత కొత్త జంట బుధవారం సాయంత్రం వరుడి ఇంటికి చేరుకున్నారు. నవ దంపతులు ఆ రాత్రికి ఒకే గదిలో కలిసి నిద్రించారు. అయితే గురువారం మధ్యాహ్నం వరకు వారిద్దరూ గది నుంచి బయటకు రాలేదు. అనుమానించిన వరుడి కుటుంబ సభ్యులు తలుపులు బద్ధలుకొట్టి లోనికి వెళ్లి చూశారు. పెళ్లైన కొత్త జంట చనిపోయి ఉండటం చూసి షాక్ అయ్యారు.
కాగా, కుటుంబ సభ్యులు దీని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. నవ దంపతుల మృతదేహాలను పరిశీలించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వారిద్దరూ గుండెపోటు వల్ల మరణించినట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తేలిందని పోలీస్ అధికారి తెలిపారు. వారు నిద్రించిన గదిని ఫోరెన్సిక్ నిఫుణులతో పరిశీలించినట్లు చెప్పారు. ఆ జంట శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, ఆ గదిలోకి ఎవరూ కూడా బలవంతంగా వెళ్లిన ఆనవాళ్లు లేవన్నారు.
ఈ నేపథ్యంలో కొత్తగా పెళ్లైన యువ దంపతులు శోభనం తర్వాత రోజు ఒకేసారి గుండెపోటుతో చనిపోవడం మిస్టరీగా ఉందన్నారు. దీనికి కారణం ఏమిటన్నది అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని వెల్లడించారు. మరోవైపు పెళ్లైన మరునాడే గుండెపోటుతో చనిపోయిన నవ దంపతులైన ప్రతాప్, పుష్ఫకు ఒకే చితిపై అంత్యక్రియలు నిర్వహించారు. ఇది చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు.