New Delhi, Mar 18: నిర్భయ సామూహిక అత్యాచారం (Nirbhaya Gang Rape Case), హత్య కేసులో దోషుల ఉరిశిక్ష అమలుకు మరో రెండు రోజుల్లో రంగం సిద్ధమైన వేళ వారు మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో తమకు విధించిన మరణ శిక్షల అమలును నిలిపేయాలని కోరుతూ ‘నిర్భయ’ కేసులో (Nirbhaya Case) దోషులు దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు (Delhi Court) విచారణకు చేపట్టింది.
చివరి దోషి పవన్ గుప్తా క్షమాభిక్షను తిరస్కరించిన రాష్ట్రపతి
డెత్ వారంట్ ప్రకారం ఈ నెల 20న వీరికి తీహార్ జైలులో (Tihar Jail) మరణ శిక్షలు అమలు కావలసి ఉండగా, ఆ జైలు అధికారులకు, పోలీసులకు (Tihar Authorities) కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ గురువారం జరుగుతుందని తెలిపింది. తాము దాఖలు చేసిన పలు పిటిషన్లు, అభ్యర్థనలు పెండింగ్‌లో ఉన్న కారణంగా రెండోసారి క్షమాభిక్ష కోరే అవకాశాలు పరిశీలించాల్సి ఉన్నందున ఉరిని నిలుపుల చేయాలని పిటిషన్‌లో దోషులు కోరారు.
దోషి అక్షయ్ సింగ్ మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు రెండోసారి క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశాడు. అదే రోజు పవన్ గుప్తా సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. నేరం జరిగిన సమయంలో తాను బాలుడినని పేర్కొంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు.
నేనొక మానసిక రోగిని, ఉరితీయకూడదు
నేరం జరిగినపుడు తాను ఢిల్లీలో లేనని, తనకు విధించిన మరణ శిక్షను రద్దు చేయాలని కోరుతూ తాను దాఖలు చేసిన పిటిషన్‌ను ట్రయల్ కోర్టు తోసిపుచ్చడాన్ని సవాల్ చేస్తూ ముఖేష్ సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది.
2012, డిసెంబరు 16 నాటి నిర్భయ అత్యాచార కాండలో ఆరుగురు వ్యక్తులు దోషులుగా తేలగా... ప్రధాన దోషి రామ్ సింగ్ తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మరో దోషి మైనర్ కావడంతో సాధారణ జైలు శిక్ష తర్వాత అతడిని విడుదల చేశారు.
ఇక మిగిలిన నలుగురు దోషులు పవన్ గుప్తా, వినయ్ శర్మ, ముఖేశ్ సింగ్, అక్షయ్ ఠాకూర్‌లకు ఉరిశిక్ష విధిస్తూ ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పును ఖరారు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయగా.. ఇప్పటికే మూడుసార్లు వారిని ఉరితీసేందుకు డెత్ వారెంట్లు జారీ అయ్యాయి. అయితే ఎప్పటికప్పుడు వారు పిటిషన్లు దాఖలు చేస్తుండటంతో ఉరి వాయిదా పడుతూ వస్తోంది.
తాజాగా మార్చి 20న ఉదయం ఆ నలుగురికి మరణ శిక్ష విధించాలనే ఆదేశాల నేపథ్యంలో వరుసగా మరోసారి పిటిషన్లు దాఖలు చేస్తూ ఈసారి కూడా శిక్ష అమలు తేదీని వాయిదా వేసేందుకు దోషులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం వారిని ఉరి తీస్తారా లేదా అన్న అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.