Noida, August 23: నోయిడాలోని సూపర్‌టెక్ ట్విన్ టవర్స్ కూల్చివేతకు (Noida Twin Towers Demolition) వచ్చే ఆదివారం రంగం సిద్ధం అయింది. సుమారు 3700 కిలోల పేలుడు పదార్ధాలతో (Twin Towers Rigged With 3,700 Kg Explosives ) ఆ రెండు బిల్డింగ్‌లను పేల్చనున్నారు. దీని కోసం పేలుడు పదార్ధాలను ట్విన్స్ టవర్స్‌లో అమర్చడం పూర్తి అయ్యింది. ఆదివారం ఆ రెండు బిల్డింగ్స్‌ను షెడ్యూల్ ప్రకారం పేల్చి వేయనున్నారు. పేలుడు పదార్ధాల చార్జింగ్ ప్రక్రియను సోమవారం పూర్తి చేశారు. ఇక ఇప్పుడు ట్రంకింగ్ పనులను మొదలుపెట్టనున్నారు.
29 అంతస్తులు ఉన్న సియాన్, 32 అంతస్తులు ఉన్న ఎపెక్స్ టవర్స్‌కు ఆగస్టు 13 నుంచి 40 మంది చార్జింగ్ పనులు చేపట్టారు. ట్విన్ టవర్స్‌ను పేల్చేందుకు ఎడిఫైస్ ఇంజనీరింగ్ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఆగస్టు 26వ తేదీ లోపు చార్జింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని షెడ్యూల్ పెట్టుకున్నామని, ఇక షెడ్యూల్ ప్రకారమే ఆగస్టు 28వ తేదీన మధ్యాహ్నం 2.30 నిమిషాలకు బిల్డింగ్‌ను పేల్చివేయనున్నట్లు ఎడిఫైస్ అధికారి ఒకరు తెలిపారు.
రెండు బిల్డింగ్‌లకు కలిపి మొత్తం 20వేల కనెక్షన్లు ఇచ్చారు. అయితే కేవలం ఆదివారం రోజున మాత్రమే (Sunday Demolition) డిటోనేటర్‌తో మెయిన్ చార్జింగ్‌కు కనెక్షన్ ఇవ్వనున్నారు. ఎడిఫైస్ ప్రాజెక్ట్ మేనేజర్ మయూర్ మెహతాతో పాటు సౌతాఫ్రికాకు చెందిన జెట్ డెమోలిషన్ సంస్థలోని ఏడు మంది నిపుణులు మాత్రమే పేల్చివేత సమయంలో అక్కడ ఉండనున్నారు.