File images Maruthi Rao & Paranay- Amrutha | File Photo

Hyderabad, March 8: కూతురు పుడితే అసహ్యించుకునే కొందరు తండ్రులు ఉన్న మన సమాజంలోనే, కూతురు అంటే ఎంతో పిచ్చి ప్రేమను చూపించే తండ్రులూ ఉన్నారు. ఒక గొప్ప తండ్రి, తన కొడుకును మహారాజులా చూసుకుంటాడో లేదో గానీ, అదే కూతురును మాత్రం మహారాణిలా చూసుకునే తండ్రులు మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు. తన కొడుకుపై కంటే పది రేట్ల ప్రేమను బిడ్డకు పంచుతూ, తన కూతురులోనే తన తల్లిని, ఒక దేవతను చూసుకుంటూ ఇంట్లో మహాలక్ష్మి పుట్టిందని మురిసిపోయే తండ్రులూ ఉంటారు. అలాంటి వారు, తన బిడ్డ బంగారు భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటారు.

తెలంగాణలోని మిర్యాలగూడలో (Miryalaguda)  మారుతీరావు (Maruthi Rao) అనబడే బాగా పలుకుబడి కలిగిన ఓ వ్యాపారవేత్త తన ఇంటికి 'అమృత నిలయం' అని పేరు పెట్టుకున్నాడు. అమృత (Amrutha) ఎవరో కాదు, తను అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు పేరు.  ఏ తండ్రి తన కొడుకు పేరును ఇంటికి అలా పెట్టుకోడు, కానీ తన కూతురు పేరును మాత్రం ఇంటికి పెట్టుకుంటాడు. అది ఒక తండ్రికి కూతురు పట్ల ఉండే ప్రేమకు నిదర్శనం.

అయితే తన కూతురు ఒక కులం తక్కువ వాడిని ప్రేమించి ఇంటి నుంచి వెళ్లిపోవడంతో, తన కూతురు మీద పెంచుకున్న విపరీతమైన ప్రేమ, కూతురి భర్తపై తీవ్రమైన కోపం, కక్షగా మారింది. అందుకే కూతురును ఒక్క మాట అనలేద్దు, ఆవేశంలో ఆమె భర్తను దారుణంగా హత్య చేయించాడు. ఇదే మారుతీ రావు చేసిన అతిపెద్ద తప్పు. కూతురుకి బంగారు భవిష్యత్తును ఇద్దామనుకున్న ఆ కన్నతండ్రి చేతులే, కసాయి చేతులుగా మారి తన కన్న కూతురి భర్త రక్తంతో తడిసిపోయాయి. మారుతీరావు విపరీత చర్యతో తన బిడ్డకు భవిష్యత్తే లేకుండా చేయగా, ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు కూడా పుట్టకముందే తండ్రి లేకుండా చేసింది. ఇది మారుతీ రావు చేసిన సరిదిద్దుకోలేని తప్పు.

మారుతీరావు చేసిన తప్పుతో తను అంతకాలంగా సాధించుకున్న పేరు, గౌరవం ఒక్కసారిగా మంటగలిసి పోయాయి. సమాజం నుంచి ఎన్నో ఛీత్కారాలను ఎదుర్కొన్నాడు, అమృత పరిస్థితిని చూసి సమాజం కూడా అప్పట్లో జాలిపడింది. కానీ, అదే అమృతను ఛీత్కరించే వాళ్లు కూడా ఎందరో. ఎందుకంటే ఈ కథలో తను బాధితురాలే కావొచ్చు కానీ అందుకు కారకురాలు కూడా తనే!

మన సమాజంలో లేచిపోయి ప్రేమ పెళ్లిళ్లు, కులాంతర వివాహాలు చేసుకునే వాళ్లు ఎందరో ఉన్నారు, ఉంటారు. వాళ్లందరూ మళ్లీ వారి వారి కుటుంబంతో కలుస్తారా.. లేదా? అనేది తర్వాత సంగతి కానీ, ఎవరి బ్రతుకులు మాత్రం బ్రతుకుతారు. కానీ వారందరూ చేయని తప్పు, అమృత చేసిన తప్పు ఒకటుంది.

కూతురు కులం తక్కువ వ్యక్తితో లేచిపోయిందనే బాధ అనుభవిస్తున్న మారుతీరావు ఫ్యామిలీ బాధలో ఉన్న సమయంలో అమృత తాను ఘనకార్యం చేసినట్లుగా అదే ఊర్లో ఉంటూ, వెడ్డింగ్ షూట్లు, ఫోటోగ్రఫీలు పెట్టుకొని మరింత ప్రచారంలోకి రావడం. ఇలాంటి చర్యలతో అమృత కుటుంబానికి పుండు మీద కారం చల్లినట్లయింది. ఇదే క్రమంలో మారుతీ రావు ఆవేశపూరిత నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

Pranay+ Amrutha Post Wedding Shoot, file video: 

చివరికి ఏమైంది? మారుతీ రావు కూడా చనిపోయాడు. ఈరోజు ఆదివారం ఉదయం హైదరాబాద్ లోని ఆర్య-వైశ్య భవన్ లో మారుతీరావు బలవణ్మరణానికి పాల్పడ్డాడనే వార్త సర్వత్రా వ్యాపించింది. అతడు ఆత్మహత్య చేసుకున్నాడా? లేక మరేదైనానా? అనేది పోలీసులు తేలుస్తారు. కానీ, ఈ పరిణామాలన్నింటికీ కేంద్రం ప్రణయ్- అమృతల ప్రేమ వ్యవహారమే. ఈ చావుకి కారణం కులాంతర వివాహం కాదు, అది కులాతీతమైనది.

అంతేకాకుండా తన తండ్రి మరణించాడన్న వార్త విని కూడా అమృత మీడియా ప్రవర్తించే ధోరణిని పలువురు తప్పుపడుతున్నారు. తన తండ్రి ద్వారా తనకు తీర్చలేని అన్యాయం జరిగి ఉండవచ్చు, కానీ మిగతా కుటుంబ సభ్యులు ఏం చేశారు? వారి కూతురు వెళ్లిపోయి, ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి వారెంతో క్షోభ అనుభవిస్తారు. రేపు అమృత గానీ, తనకు పుట్టబోయే బిడ్డ ఇదే సమాజంలో పెరగాల్సి ఉంటుంది. ఆమె ధోరణితో ప్రజల సానుభూతి కూడా కోల్పోయే ప్రమాద ఉంటుంది.

ఇప్పుడు ఈ కథలో ఎవరు గెలిచారు? అంటే ఎవ్వరూ గెలవ లేదు, ఎవ్వరూ సంతోషంగా లేరు. రెండు వైపులా నష్టం జరిగింది, రెండు కుటుంబాలు నాశనమయ్యాయి. కానీ, ప్రణయ్- అమృత మరియు మారుతీరావుల ఎపిసోడ్ సమాజంలో ప్రేమికులకు, వారి కుటుంబాలకు ఒక ఉదాహారణ, ఒక హెచ్చరిక లాంటింది.

నాణానికి రెండు పార్శ్వాలు ఉన్నట్లే, ప్రేమకు కూడా రెండు పార్శ్వాలు ఉంటాయి. ప్రేమ ఎంత అందమైనదో, తేడా వస్తే అంతే వికృతమైనది కూడా. ఈరోజుల్లో కూడా కులం ఏంటని ఎంతమంది వాదించినా రిజర్వేషన్లు ఉన్నంత కాలం కులాలను ఎవరూ మార్చలేరు. కాబట్టి ఆ తరహా వివాహాలు చేసుకునే జంటలు, తల్లిదండ్రులను ఒప్పించకపోయినా కనీసం వారి మనసులను పదేపదే నొప్పించకపోతే అందరికీ మంచిది.