Maruthi Rao Suicide: మారుతి రావు ఆత్మహత్య, అసలేం జరిగింది?, అమృత తండ్రి ఆత్మహత్యకు కారణమేంటి ?, ప్రణయ్‌ హత్య కేసులో నిందితుడిగా మారుతీరావు, కేసుల ఒత్తిడే కారణమంటున్న ఆయన భార్య
main accused in Pranay Caste killing, found dead in Telangana State (photo-Twitter)

Hyderabad, Mar 08: రెండు సంవత్సరాల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్‌ హత్య కేసులో (Pranay Murder Case) నిందితుడిగా ఉన్న మారుతీరావు ఆత్మహత్య (Maruthi Rao Suicide) చేసుకోవడం కలకలం రేపింది. 2020, మార్చి 08వ తేదీ ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో (Arya Vaishya Bhavan) విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని చింతల్‌బస్తీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ ఆత్మహత్య ద్వారా ఇప్పుడు అనేక ప్రశ్నలు బయటకు వస్తున్నాయి. కాగా అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే దానిపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

కూతురిని పెళ్లి చేసుకున్నాడన్న కోపంతో ప్రణయ్‌ని (Pranay) హత్య చేయించినట్లు మారుతీరావుపై ఆరోపణలున్నాయి. తన కుమార్తె అమృత (Amrutha) వేరే కులం అతనిని ప్రేమించి పెళ్లిచేసుకుందన్న కోపంతో 2018 సెప్టెంబర్‌ 14న మిర్యాలగూడలోని ఓ ఆసుపత్రి వద్ద ప్రణయ్‌ను కిరాయి హంతకులతో మారుతీ రావు హత్య చేయించినట్టు కేసు నమోదయ్యింది.

Here's Video

 

ఈ కేసులో మారుతిరావును పోలీసులు అరెస్ట్‌ చేయడంతో 7నెలలపాటు జైలు జీవితం గడిపారు. అనంతరం బెయిల్‌పై బయటికి వచ్చారు. అమృత గర్భవతిగా ఉన్న సమయంలో వైద్య పరీక్షల నిమిత్తం ప్రణయ్‌, ఆయన తల్లి హాస్పిటల్‌కు తీసుకెళ్లి అక్కడ నుంచి బయటకు వస్తుండగా ప్రణయ్‌ హత్య జరిగింది.

వెనుక నుంచి వచ్చిన నిందితుడు ప్రణయ్‌ను కత్తితో దారుణంగా నరికి హత్య చేశాడు. కుమార్తె అమృత కులాంతర వివాహం చేసుకుందన్న ఆగ్రహంతో మారుతీరావే సుపారీ ఇచ్చి ప్రణయ్‌ని హత్య చేయించినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నారు. మారుతీరావుతో పాటు ఆయన సోదరుడు శ్రవణ్‌కుమార్‌, మరో వ్యక్తిపైనా పోలీసులు పీడీ యాక్టు (Preventive Detention (PD) Act) కింద కేసు నమోదుచేసి అరెస్టు చేశారు.

ప్రణయ్ హత్య కేసులో అనుకూలంగా సాక్ష్యం చెబితే ఆస్తి తన పేరున రాస్తానని మధ్య వర్తులతో అమృతకు రాయబారం కూడా పంపారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ అందుకు అమృత అంగీకరించకపోవడంతో ఆత్మహత్య శరణ్యం అనుకొని బలవన్మరణానికి పాల్పడ్డారని తెలుస్తోంది.

ఈ పరిస్థితులు ఇలా ఉంటే మారుతీరావు సోదరుడి నుంచి కూడా ఆస్తి కోసం వేధింపులు వస్తున్నాయని తెలుస్తోంది. మారుతీరావుకు ఒక్కరే సంతానమైన అమృత తన భర్తను హత్య చేయించడంతో తండ్రి మీద  కోపంతో ఉన్నారు. మాట్లాడటం మానేశారు.

దీంతో  సోదరుడు తన కుమారులపై ఆస్తి మొత్తం రాయాలని అడుగుతున్నాడు. తన కుమారుల పేరు మీద మొత్తం ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయాలని ఒత్తిడి తీసుకొస్తున్నాడు. దీనిపై సోదరుడికి ఏం చెప్పాలో తెలియని మారుతీరావు మిర్యాలగూడకు వెళ్లడం లేదని తెలుస్తోంది.

మారుతీరావు ఆత్మహత్య విషయం గురించి ఆయన కూతురు అమృతను అడిగితే మాత్రం.. తనకు అసలు ఈ విషయం గురించి తెలియదని.. అసలు అతను ఎక్కడ ఉంటున్నాడో కూడా తెలియదని ఆమె తెలిపింది.

Here's Amrutha Reaction

కాగా ప్రణయ్ కేసు ఇంకా విచారణలోనే ఉంది. ఈలోగా మారుతీరావు ఆత్మహత్య చేసుకుంటాడని ఎవరూ ఊహించలేదు. మారుతీరావు భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసుల ఒత్తిడితోనే ఆయన చనిపోయినట్లు మారుతీరావు భార్య అంటున్నారు. పోలీసులు మారుతీరావు చనిపోయిన గదిలో సూసైడ్‌నోటును స్వాధీనం చేసుకున్నారు.

ఇదిలా ఉంటే ఇటీవల మిర్యాలగూడలోని మారుతీరావు షెడ్డులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడం కూడా కలకలం రేపింది. ఆ మృతదేహం ఎవరిది? ఆ షెడ్డులోకి ఎలా వచ్చింది? అన్నది ఇంతవరకు తేలలేదు. ఈ తరుణంలోనే మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం రేపుతోంది.