
Jaipur, OCT 15: రిజర్వేషన్ కేటగిరీకి చెందిన ధ్రువపత్రం అక్కర్లేకుండా ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించింది రాజస్తాన్ ప్రభుత్వం (Rajasthan government). ఈ ప్రతిపాదనకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) శనివారం ఆమోదముద్ర వేశారు. దీని ప్రకారం.. ఓబీసీ, ఎంబీసీ సహా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అర్హత కలిగినవారు ప్రభుత్వం అందించే గుర్తింపు పత్రం అవసరం లేకుండానే ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వెనుకడిన తరగతులు (OBC), అత్యంత వెనుకవడిన తరగతులు (MBC) సహా ఆర్థికంగా వెనుకబడిన తరగతుల (EWS) వారు ఒక అఫిడవిట్ సబ్మిట్ చేయడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయవచ్చు.
దీనికి కుల ధ్రువీకరణ పత్రం అక్కర్లేదు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలోని చాలా మంది అభ్యర్థులు ప్రయోజనం పొందుతారని రాజస్తాన్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఈ సర్క్యూలర్ జనవరి 20నే ఇచ్చారు. కాగా, తాజాగా ముఖ్యమంత్రి దీనికి ఆమోదం తెలిపారు.
ఈ సర్క్యులర్‌కు అనుగుణంగా లైవ్‌స్టాక్ అసిస్టెంట్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్-2021, జూనియర్ ఇంజనీర్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్-2022, పట్వార్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్-2021 ఉద్యోగాల భర్తీకి జనవరి 20, 2022 లోపు ప్రకటన చేయడం వల్ల.. తాజా నిర్ణయం వాటికి వర్తిస్తుందా లేదా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.