Bhubaneswar, Mar 30: ఒడిశాలో అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర అంశం చోటు చేసుకుంది. సాధారణంగా అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు నిరసనలు తెలపుతూ ఉంటారు. అయితే, ఆ క్రమంలో కొందరు సభ్యులు రెచ్చిపోతూ దుందుడుకు చర్యలకు పాల్పడుతూ కలకలం రేపుతున్నారు. ఇటువంటి ఘటనే ఒడిశా అసెంబ్లీలో చోటుచేసుకుంది.రాష్ట్రంలో జరుగుతున్న గనుల అక్రమాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే తారాప్రసాద్ బహినిపాటి (MLA Taraprasad Bahinipati ) చర్చను చేపట్టాలంటూ వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే దానిని స్పీకర్ ఎస్‌ఎన్ పాత్రో తిరస్కరించారు. దీంతో మండిపడిన ఎమ్మెల్యే తారాప్రసాద్ స్పీకర్ పోడియం ముందున్న కుర్చీని పైకిలేపి (Odisha Congress MLA Taraprasad Bahinipati Lifts Chair ) ఎత్తేశాడు. దీంతో సభలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.
ఘటన వెనక వివరాల్లోకెళితే.. కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ అయిన తారా ప్రసాద్.. ఒడిశా రాష్ట్రంలో జరుగుతున్న మైనింగ్ అక్రమాలపై వాయిదా తీర్మానం ఇచ్చారు. జీరో అవర్‌లో దానిపై చర్చించాలని పట్టుబట్టారు. దానికి స్పీకర్ తిరస్కరించారు. అనంతరం భోజన విరామం తర్వాత కూడా అదే అంశంపై చర్చకు అనుమతించాలని కోరాడు.
గనుల యజమానులు అక్రమంగా మైనింగ్‌తో ఒడిశాను దోచుకుంటున్నారని ఆరోపించాడు. అయితే చర్చకు స్పీకర్ పాత్రో నిరాకరించడంతో ఆవేశంతో ఊగిపోయిన తారాప్రసాద్.. హెడ్‌ఫోన్స్ విరగొట్టారు. అంతటితో ఆగకుండా పోడియంలోకి దూసుకెళ్లారు. పోడియం ముందున్న కుర్చీని పైకెత్తి పడేయడంతో అది విరిగిపోయింది. కాగా, ఎమ్మెల్యే ప్రవర్తనపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.