New Delhi, June 25: 18వ లోక్‌సభ స్పీకర్ (Lok Sabha Speaker) ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. తాజాగా లోక్‌సభ స్పీకర్ (Lok Sabha Speaker) ఎన్నికలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. విపక్ష ఇండియా కూటమి కూడా స్పీకర్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైంది.
విపక్ష ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ ఎంపీ సురేశ్ నామినేషన్ వేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.దీంతో స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. కాగా డిప్యూటీ స్పీకర్ పదవి దక్కకపోవడంతో సభాపతి స్థానానికి ఇండియా కూటమి పోటీపడుతోంది.
సాధారణంగా లోక్‌సభలో స్పీకర్ పదవిని అధికార పక్షం, ఉప సభాపతి పదవిని విపక్షం (INDIA Alliance) చేపట్టడం ఆనవాయితీగా వస్తుండగా.. గత హయాంలో డిప్యూటీ స్పీకర్ లేకుండానే సభలు నడిచాయి. అయితే, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలతో దిగువ సభలో తమ బలాన్ని పెంచుకున్న ప్రతిపక్షాలు ఈసారి డిప్యూటీ సీఎం పదవికి పట్టుబట్టాయి. స్పీకర్ పదవి అధికార పక్షం తీసుకుంటే.. ఉప సభాపతి స్థానాన్ని (Depity Speaker Post) తమకు ఇవ్వాలని డిమాండ్ చేశాయి. లేదంటే స్పీకర్ పదవికి తాము అభ్యర్థిని నిలబెడతామని హెచ్చరించాయి. లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లాను ప్రతిపాదించిన ఎన్డీయే కూటమి, ట్విస్ట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ
ఈ క్రమంలోనే కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను బీజేపీ రంగంలోకి దించింది. ఈ ఉదయం నుంచి ఆయన మల్లికార్జున్ ఖర్గే, ఎంకే స్టాలిన్ సహా పలువురు ఇండియా కూటమి నేతలతో వరుస చర్చలు జరిపారు. స్పీకర్ పదవి ఏకగ్రీవమయ్యే సంప్రదాయాన్ని కొనసాగిద్దామని, అందుకు సహకరించాలని కోరారు. ఇందుకు ప్రతిపక్షాలు అంగీకరించినప్పటికీ.. డిప్యూటీ స్పీకర్ పదవి కావాలన్న డిమాండ్ మళ్లీ ముందుంచాయి.
అయితే దీనికి ఎన్డీయే సర్కారు సమ్మతించలేదు. దీంతో నామినేషన్ గడువు ముగియడానికి కేవలం కొన్ని నిమిషాల ముందు ఎన్డీయే, ఇండియా కూటమి అభ్యర్థులు పోటీకి దిగుతున్నట్లు ప్రకటించారు. తమ అభ్యర్థి పత్రాలను సమర్పించారు. ఫలితంగా స్పీకర్ పదవికి ఎన్నిక అనివార్యమైంది. బుధవారం (జూన్ 26) ఈ ఎన్నిక నిర్వహించనున్నారు.