Lab | Representational Image (Photo Credits: PTI)

New Delhi, Dec 2: ఒమిక్రాన్‌ వేరియంట్‌ భారత్‌లోకి ప్రవేశించింది. తాజాగా.. భారత్‌లో రెండు కేసులు నమోదయినట్లు (Omicron in India) కేంద్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. కర్ణాటకలో రెండు ఒమిక్రాన్‌ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. విదేశాల నుంచి వచ్చిన వారిలో (New COVID-19 Variant Detected in Karnataka) కొత్తవైరస్‌ నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. కాగా, వీరికి తీవ్రమైన లక్షణాలు లేనట్లు పేర్కొన్నారు. గత నెల 11, 12 తేదీల్లో వీరిద్దరూ విదేశాల నుంచి వచ్చినట్లు లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు.

వైరస్‌ సోకిన ఇద్దరు పురుషుల్లో ఒకరికి 46, మరోకరికి 66 ఏళ్లని కేంద్రం తెలిపింది. వైరస్‌ సోకిన ఇద్దరిని ప్రత్యేకంగా ఐసోలేషన్‌లో తరలించినట్లు కేంద్రం తెలిపింది. కాగా, ఒమిక్రాన్‌ సోకినవారి ప్రైమరీ కాంటాక్ట్స్‌ ట్రేస్‌ చేస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. అయితే, వీరిద్దరిలో తీవ్రమైన లక్షణాలు లేవని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. కేరళ, మహారాష్ట్రలలో 10,000 కంటే ఎక్కువ కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని.. దేశంలోని 55 శాతం కేసులు ఈ రెండు రాష్ట్రాల్లో నమోదయ్యాయని చెప్పారు. వారంవారీ కోవిడ్-19 పాజిటివిటీ రేటు 15 జిల్లాల్లో 10 శాతం కంటే ఎక్కువ.. 18 జిల్లాల్లో 5 నుంచి 10 శాతం మధ్య ఉందన్నారు.

ఒమిక్రాన్ శరీరంలోకి ప్రవేశిస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, ఈ కొత్త కోవిడ్ వేరియంట్‌‌పై డాక్టర్లు ఏమి చెబుతున్నారు, ఒమిక్రాన్ కోవిడ్ వేరియంట్‌ (బీ.1.1.529) పై ప్రత్యేక కథనం

ఇప్పటివరకూ 29 దేశాల్లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ వెలుగుచూడగా, 373 మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు. ఒమిక్రాన్‌ వైరస్‌పై ప్రధాని నరేంద్రమోదీ అధికారులతో అత్యవసరంగా సమీక్ష సమావేశం నిర్వహించారు.ప్రస్తుత పరిస్థితిని ఆరోగ్యశాఖాధికారులు మోదీకి వివరించారు. ప్రజలందరు మాస్క్‌ ధరించాలని, కరోనా నిబంధనలను పాటించాలని మోదీ సూచించారు.