Operation Ganga: రాబోయే రోజుల్లో 31 విమానాలు, ఉక్రెయిన్‌లో చిక్కుక్కున్న ప్రతి ఒక్క 6300 మంది భారతీయుడిని తీసుకువస్తాం, ఏ ఒక్క ప్రయత్నాన్నీ వదిలి పెట్టమని తెలిపిన కేంద్రం
File image of Air India flight (Photo Credits: IANS)

New Delhi, Mar 2: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన వారిని వేగంగా భారత్‌కు తరలిస్తున్నది. రాబోయే రోజుల్లో 31 విమానాల్లో తూర్పు యూరోపియన్‌ దేశంలో చిక్కుకుపోయిన 6300 మంది భారతీయులను (31 Evacuation Flights to Bring Back Over 6,300 Indians) తరలించనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఆపరేషన్‌ గంగాలో భాగంగా ఎయిర్‌ ఇండియా, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌, ఇండిగో, స్పైస్‌జెడ్‌, ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ప్రత్యేక విమానాలు నడుపనున్నాయి. ఈ నెల 2 నుంచి రొమేనియాలోని బుకారెస్ట్‌ నుంచి భారతీయులను తరలించేందుకు 21 విమానాలు నడవనున్నాయి.

హంగేరిలోని బుడాపెస్ట్‌ నుంచి నాలుగు విమానాలు, పోలాండ్‌ని ర్జెస్జో నుంచి నాలుగు, స్లోవేకియాలోని కోసీస్‌ నుంచి మరో విమానం నడువనున్నది. ఎయిర్ ఫోర్స్‌ బుకారెస్ట్‌ నుంచి భారతీయులను తరలించనున్నది. మొత్తం 31 విమానాలు 2-8వ తేదీ వరకు 6,300 మంది కంటే ఎక్కువ మందిని స్వదేశానికి తీసుకురాబోతున్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌, స్పైజ్‌ జెట్‌ విమానాల్లో 180 మంది ప్రయాణించే సామర్థ్యం ఉన్నది. ఎయిర్‌ ఇండియా 250, ఇండిగో 216 మందిని తరలించే సామర్థ్యం ఉన్నది. ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ ఏడు, స్పైస్‌జెట్‌ 4, ఎయిర్‌ ఇండియా ఏడు, ఇండిగో 12 విమానాల్లో ప్రజలను తరలించనున్నది.

గత 24 గంటల్లో ఉక్రెయిన్ నుంచి 1,377 మంది భారతీయులను ఇండియాకు తీసుకువచ్చాం, మూడు రోజుల్లో 26 విమానాలను ఆపరేట్ చేయబోతున్నామని తెలిపిన భారత విదేశాంగ మంత్రి జయశంకర్

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఎయిర్ ఇండియా బుకారెస్ట్ నుంచి, ఇండిగో బుకారెస్ట్, బుడాపెస్ట్, ర్జెస్జో నుంచి నాలుగు చొప్పున విమానాలను నడుపుతున్నది. స్పైస్‌జెట్ బుకారెస్ట్ నుంచి 2, బుడాపెస్ట్ నుంచి ఒకటి, స్లోవేకియాలోని కోసీస్ నుంచి మరో విమానంలో భారతీయులను తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. ఫిబ్రవరి 26 నుంచి ఇప్పటి వరకు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను కేంద్ర ప్రభుత్వం 9 విమానాల్లో తరలించింది. ఆపరేషన్‌ గంగా కింద గత 24 గంటల్లో ఆరు విమానాలు భారత్‌కు బయలుదేరాయని విదేశాంగ మంత్రి జైశంకర్‌ బుధవారం తెలిపారు.

యుద్ధంతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్ నుంచి భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని, ఏ ఒక్క ప్రయత్నాన్నీ వదిలి పెట్టేది లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోన్‌భద్ర జిల్లాలో బుధవారంనాడు జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ, ఆపరేషన్ గంగా (Operation Ganga) పేరుతో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా వెనక్కి తెస్తున్నామని చెప్పారు.

వేలాది మందిని ఇప్పటికే భారత్‌తు తీసుకువచ్చామని చెప్పారు. తాము చేపట్టిన ఆపరేషన్‌ను మరింత వేగవంతం చేసేందుకు నలుగురు మంత్రులను కూడా అక్కడకు పంపామని, భారతీయులను సురక్షితంగా తెచ్చేందుకు అందుబాటులో ఉన్న ఏ అవకాశాన్ని కూడా వదలిపెట్టేది లేదని అన్నారు. ఇండియా బలం పెరుగుతున్నందున్నే మనం ఇలాంటి సురక్షిత చర్చలు తీసుకోగలుగుతున్నామని అన్నారు. కాగా, ఈనెల 7వ తేదీన జరిగే తుది విడత పోలింగ్‌లో సోన్‌భద్ర జిల్లా కూడా ఉంది. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు ప్రకటించనున్నారు.