Chennai, May 5: దేశంలో కరోనా మహమ్మారి విళయతాండవం చేస్తున్నవేళ.. ఆక్సిజన్ కొరత కోవిడ్ రోగులను పొట్టన పెట్టుకుంటోంది. తాజాగా తమిళనాడులోని చెంగల్‌పట్టులో తీవ్ర విషాదం (Oxygen Shortage In Tamil Nadu) చోటుచేసుకున్నది. చెంగల్‌పట్టులోని ప్రభుత్వఆస్పత్రిలో (Chengalpattu Government Medical College) ఆక్సిజన్ అందకపోవడంతో 11 మంది కరోనా రోగులు మృతి (11 patients die due to oxygen shortage) చెందారు.
దీంతోఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆక్సిజన్ అవసరం ఉన్న రోగులను అధికారులు ఇతర హాస్పిటళ్లకు తరలించారు. ఇప్పటికీ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత ఉన్నట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం ఆక్సిజన్ ట్యాంక్ పూర్తిగా ఖాళీ కావటంతో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
ఆక్సిజన్ సరఫరా లేకపోవటంతో మరికొంత మంది కరోనా పేషెంట్ల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆక్సిజన్ తెప్పించేందుకు ఆస్పత్రి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఐదు గంటల ముందే ఆక్సిజన్ లేదని చెప్పినా వైద్యులు పట్టించుకోలేదని కరోనా బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఇటీవల మహారాష్ట్రలోని ఓ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 24 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనే కర్ణాటకలో రెండు రోజుల క్రితం చోటుచేసుకున్నది. కర్ణాటలోని చామరాజనగర్‌లో ఉన్న జిల్లా ఆస్పత్రిలో సోమవారం తెల్లవారుజామున ఆక్సిజన్ అందకపోవడంతో 2 గంటల్లో 24 మంది రోగులు మృతి చెందారు. వీరిలో కొందరు కోవిడ్ పేషంట్లు కూడా ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి సోమవారం తెల్లవారుజామున 2 గంటల మధ్య వారు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.
ఈ మరణానికి గల కారణాలపై అధికారులు విచారణకు ఆదేశించారు. ఆక్సిజన్ కొరత కారణంగా రోగులు మరణించారని ఆరోపించినప్పటికీ, సీనియర్ అధికారులు ఆసుపత్రిలో తగినంత స్టాక్ ఉన్నందున ఇది ఆక్సిజన్ కొరత మరణాలు కాదని చెబుతున్నారు. ప్రాధమిక నివేదికల ప్రకారం, ఆసుపత్రిలో తగినంత ఆక్సిజన్ నిల్వ ఉంది. ఇది ఆక్సిజన్ సరఫరా సమస్య కాదు. మరణానికి కారణం ఏమిటనేది విచారణ మాత్రమే వెల్లడిస్తుందని ఆరోగ్య కార్యదర్శి జె. రాధాకృష్ణన్ చెప్పారు.ఆక్సిజన్ తో వెంటిలేటర్ల మీద అనేక మంది రోగులు ఉన్నారని మరియు వారు ప్రభావితం కాలేదని ఆయన అభిప్రాయపడ్డారు.
కాగా కొన్ని రోజుల క్రితం ప్రభుత్వ వెల్లూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో (Government Vellore Medical College Hospital) ఆరుగురు రోగుల మరణాలు ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కారణంగానే జరిగిందని రోగుల బంధువులు ఆరోపించారు. అయితే "ఆసుపత్రి కోవిడ్ -19 వార్డులో 150 మందికి పైగా రోగులు ఉన్నారు. చాలా మంది రోగులకు ఆక్సిజన్ సరఫరా అంతరాయం కలిగించలేదని అధికారి తెలిపారు. ప్రభుత్వ వెల్లూర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ విషయంలో డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ విచారణకు ఆదేశించారు.