Indian Parliament (Photo credits: Wikimedia Commons)

New Delhi, January 28: పార్లమెంటు క్యాంటీన్‌లో ఎంపీలకు ఆహారంపై ఇచ్చే సబ్సిడీ తొలగిస్తున్నట్లు ఇటీవ‌లే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. స‌బ్సిడీ ఎత్తేసిన త‌ర్వాత కొత్త ధ‌ర‌లతో మెనూ ఏర్పాటు చేశారు. రాబోయే బ‌డ్జెట్ సెష‌న్‌లో ర‌క‌ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను ఎంపీల‌కు వ‌డ్డించ‌డానికి సిద్ధం చేస్తున్నారు. అయితే వీటికి కొత్త ధ‌ర‌లు (Parliament Canteen New Rates) చెల్లించాల్సి ఉంటుంది.

ఇప్పుడు నాన్ వెజ్ బ‌ఫే కోసం ఎంపీలు రూ.700 చెల్లించాల్సిందే. మెనూలో అత్య‌ధిక ధ‌ర (Parliament canteen price list) ఉన్నది ఇదే. ఇక అతి త‌క్కువగా ఒక చ‌పాతీ ధ‌రను రూ.3గా నిర్ణ‌యించారు. ఇన్నాళ్లూ పార్ల‌మెంట్ క్యాంటీన్‌లో హైద‌రాబాద్ మ‌ట‌న్ బిర్యానీ రూ.65కే ఇచ్చేవాళ్లు. ఇప్పుడు దాని ధ‌ర రూ.150కి చేరింది.

ఈ పెరిగిన ధ‌ర‌లు జ‌న‌వ‌రి 29 నుంచి అమ‌ల్లోకి రానున్నాయి. అదే రోజు పార్ల‌మెంట్ బ‌డ్జెట్ సెష‌న్ ప్రారంభం కాబోతున్న విష‌యం తెలిసిందే. కొత్త ధ‌ర‌ల ప్ర‌కారం శాకాహార భోజనానికి రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.

Here's Price List: 

ఇక గ‌తంలో రూ.12గాఉన్న ఉడ‌క‌బెట్టిన కూర‌గాయ‌ల ధ‌ర‌ను రూ.50కి పెంచారు. త్వ‌ర‌లోనే పార్ల‌మెంట్ క్యాంటీన్‌లో స‌బ్సిడీని ఎత్తేస్తున్న‌ట్లు జ‌న‌వ‌రి మొద‌ట్లోనే స్పీక‌ర్ ఓం బిర్లా చెప్పిన విష‌యం తెలిసిందే. ఈ స‌బ్సిడీని ఎత్తేయ‌డం వ‌ల్ల లోక్‌స‌భ సెక్ర‌టేరియ‌ట్‌కు ఏడాదికి రూ.8 కోట్లు మిగ‌ల‌నుంది.

ఎంపీలకు ఈ పార్ల‌మెంటు స‌మావేశాల నుంచే ఈ ధరలు అమలులోకి వస్తాయి. వ‌చ్చేనెల 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్ట‌నున్నారు.