Patanjali Covid-19 Drug: దగ్గు మందు పేరుతో కరోనా మందును తీసుకువచ్చారు, పతంజలి కరోనిల్ వాణిజ్య ప్రకటనలను వెంటనే నిలిపివేయాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆదేశాలు
Coronavirus Drug Coronil (Photo Credits: @airnewsalerts)

New Delhi, June 24: ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ (Cornavirus) ఉగ్రరూపం చూపిస్తున్న నేపథ్యంలో దాని విరుగుడు కోసం మందును తీసుకువచ్చేందుకు ఫార్మా కంపెనీలు, సైంటిస్టులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆశ్చర్యంగా ఇండియాకు చెందిన పతంజలి సంస్థ (Patanjali Ayurved Ltd) కరోనాకు మందును తీసుకువచ్చామంటూ అందరికీ షాక్ ఇచ్చింది. కరోనిల్, స్వాసరి పేర్లతో మందులను మార్కెట్లోకి విడుదల చేసింది.  కరోనాకు చెక్ పెట్టేందుకు కోరోనిల్, 150కి పైగా ఔషద మొక్కల నుంచి మందును తయారుచేసినట్లు వెల్లడించిన పతంజలి సంస్థ, మార్కెట్లోకి విడుదల చేసిన రాందేవ్ బాబా

ఇవి తీసుకుంటే వారం రోజుల్లోనే కరోనా నయమవుతుందని తెలిపింది. అయితే దీనిపై ఇప్పుడు వివాదం రాజుకుంది. దగ్గు మందు పేరుతో లైసెన్స్ తీసుకుని కరోనా మందును తీసుకువచ్చారని ఉత్తరాఖండ్ ప్రభుత్వం (Uttarakhand government) పతంజలి సంస్థకు నోటీసులు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో కరోనా చికిత్సకు తెచ్చిన కరోనిల్ (Coronil), స్వాసరి మందులపై ఇస్తున్న వాణిజ్య ప్రకటనలను వెంటనే నిలిపేయాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం పతంజలి సంస్థను బుధవారం ఆదేశించింది. ఇటీవల మందుల తయారీ, మార్కెటింగ్ గురించి సంస్థ పెట్టుకున్న అప్లికేషన్ కు ఆ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Here's ANI Tweet

కానీ, పతంజలి ఆ అప్లికేషన్ లో కరోనా మందు గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ‘పతంజలి అప్లికేషన్ ప్రకారం రోగ నిరోధక శక్తి, దగ్గు, జ్వరానికి మందు తయారు చేస్తామని పేర్కొన్నారు. వాళ్లకు కోవిడ్–19 కిట్ ను తయారు చేసే అనుమతి ఎలా వచ్చిందో నోటీసులు పంపి తెలుసుకుంటాం’ అని ఉత్తరాఖండ్ రాష్ట్ర ఆయుర్వేద డిపార్టు మెంట్ లైసెన్సింగ్ ఆఫీసర్ వెల్లడించారు.

కాగా జైపూర్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎన్ఐఎంఎస్)తో కలిసి కరోనా చికిత్సకు మందులు కనుగొన్నట్లు పతంజలి పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ సంస్థను ప్రమోట్ చేస్తున్న రామ్ దేవ్ బాబా స్వయంగా తానే రెండు మందులను మార్కెట్లోకి విడుదల చేశారు. కరోనిల్, స్వాసరి మందులను ఢిల్లీ, అహ్మదాబాద్, మీరట్ లలో క్లినికల్ ట్రయల్స్ కూడా చేశామని పతంజలి చెప్పింది.

ఇదిలా ఉంటే పతంజలి మందులపై ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్నివివరణ కోరినట్లుగా తెలుస్తోంది. కరోనిల్, స్వాసరి మందులను పరిశీలించి, ఆమోదించే వరకూ ఎలాంటి వాణిజ్య ప్రకటనలు ప్రసారం చేయొద్దని సంస్థను ఆదేశించినట్లు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఎన్ఐ రిపోర్ట్ చేసింది.