Woman Stabs Husband's Private Parts: బీహార్ రాజధాని పాట్నాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెళ్లైన మరుసటి రోజే భర్త ప్రైవేట్ భాగాలపై భార్య కత్తితో దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన నవ వరుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సీతామర్హి ప్రాంతానికి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ సూర్య భూషణ్ కుమార్‌కు నేహా కుమారి ఇద్దరూ కొంతకాలం నుంచి లవ్ లో ఉన్నారు.
అయితే భూషణ్‌కు అతడి తల్లిదండ్రులు పెళ్లి సంబంధం చూశారు. ఈ సంగతి నేహా కుమారికి తెలిసింది. దీంతో పాట్నాకు రావాలని ప్రియుడిపై ఒత్తిడి చేసింది. ఈ నెల 3న భూషణ్ కుమార్ పాట్నా చేరుకున్నాడు. నేహా కుమారి బలవంతంతో జూన్ 5న కోర్టులో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అనంతరం నవ దంపతులు ఒక హోటల్‌లో రాత్రికి బస చేశారు.
తల్లిదండ్రులు చూసిన పెళ్లి సంబంధంపై భూషణ్, నేహా మధ్య హోటల్ గదిలో బుధవారం తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన నేహా, భూషణ్ ప్రైవేట్ భాగాలపై కత్తితో పొడిచింది. దీంతో అతడు కేకలు వేస్తూ హోటల్ గది నుంచి బయటకు పరుగెత్తాడు. ఈ విషయాన్ని హోటల్ సిబ్బందికి చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
హోటల్‌కు చేరుకున్న పోలీసులు గాయపడిన భూషణ్ కుమార్‌ను పాట్నా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అతడి ప్రైవేట్ భాగాలపై కత్తితో దాడి చేసిన నేహా కుమారిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.