Permanent Commission for Women Officers: ఆర్మీలో మహిళా అధికారుల కోసం శాశ్వత కమిషన్‌, సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర రక్షణ శాఖ
Representational Image (Photo Credits: ANI)

New Delhi, July 24: ఇండియన్ ఆర్మీలో మహిళా అధికారుల కోసం శాశ్వత కమిషన్‌ను (Permanent Commission for Women Officers) ఏర్పాటు చేస్తూ రక్షణ శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. షార్ట్‌ సర్వీసు కమిషన్‌ (SSC) కింద రిక్రూట్‌ చేసే మహిళా అధికారులందరినీ శాశ్వత కమిషన్‌కు తీసుకురావాలంటూ గత ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు (Supreme court) చరిత్రాత్మక తీర్పు చెప్పిన సంగతి తెల్సిందే. ఈ తీర్పు మేరకు రక్షణ శాఖ శాశ్వత కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఏడు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు వాయిదా, కరోనా నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న ఎన్నికల కమిషన్

కరోనా కల్లోలం ప్రారంభంకావడంతో ఈ ప్రక్రియలో ఆలస్యమేర్పడినట్లు తెలుస్తోంది. కేంద్రం తాజా నిర్ణయంతో సైన్యంలోని మహిళా అధికారులకు (Women Officers) వెసులుబాటు కలగనుంది. ఎస్‌ఎస్‌సీలో మహిళా అధికారులను ఐదేళ్ల సర్వీసుకోసం రిక్రూట్‌ చేసేవారు. దాన్ని ఇప్పుడు 14 ఏళ్లకు పెంచేలా శాశ్వత కమిషన్‌ వెసులుబాటు కల్పించనుంది. శాశ్వత కమిషన్‌ ద్వారా మహిళలంతా పదవీ విరమణ వయసు వరకు సర్వీసులు కొనసాగుతారు.

ఈ కమిషన్‌ ద్వారా ఆర్మీలో మహిళలు విస్తృతమైన పాత్ర పోషించడానికి అవకాశం ఉంటుందని, మహిళా సాధికారతకు బాటలుపడతాయని ఆర్మీ అధికార ప్రతినిధి కల్నల్‌ అమన్‌ ఆనంద్‌ చెప్పారు. ఇండియన్‌ ఆర్మీలోని అన్ని విభాగాల్లోనూ షార్ట్‌ సర్వీసు కమిషన్డ్‌ కింద ఉన్న మహిళా అధికారులందరినీ శాశ్వత కమిషన్‌ కిందకు తీసుకువస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసినట్టు కల్నల్‌ వెల్లడించారు.

ఇకపై ఆర్మీ ఎయిర్‌ డిఫెన్స్, సిగ్నల్స్, ఇంజనీర్లు, ఆర్మీ ఏవియేషన్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్‌ ఇంజనీర్లు, ఆర్మీ సర్వీసు కార్పొరేషన్, ఇంటెలిజెన్స్‌ కార్పొరేషన్‌ వంటి విభాగాల్లో పని చేసే మహిళలంతా శాశ్వత కమిషన్‌ కింద నియామకాలే జరుగుతాయి. ఎస్‌ఎస్‌సీ కింద ఉన్న వారంతా శాశ్వత కమిషన్‌ కింద మారే డాక్యుమెంటేషన్‌ ప్రక్రియ త్వరలో చేపట్టనున్నారు.