New Delhi [India], May 2: మూడు యూరోపియన్ దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ జర్మనీకి (PM Narendra Modi arrives in Germany) చేరుకున్నారు. సోమవారం నుంచి మూడు రోజులపాటు జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్ దేశాల్లో(PM Modi Europe Tour) పర్యటిస్తారు. యూరప్ ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్న వేళ అక్కడ పర్యటిస్తున్నట్టు ఒక ప్రకటనలో ఆయన అన్నారు. ‘‘యూరప్ దేశాలతో సహకార స్ఫూర్తిని బలోపేతం చేయడానికి ఈ పర్యటన తోడ్పడుతుంది.
శాంతి, శ్రేయస్సులను కాంక్షించే భారత్ వంటి దేశాలకు ఈయూ దేశాలే భాగస్వామ్య పక్షాలు’’ అన్నారు. సోమవారం మోదీ జర్మనీకి చేరుకుని చాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్‌తో సమావేశమవుతారు. 3, 4 తేదీల్లో డెన్మార్క్ పర్యటిస్తారు. ప్రధాని మెట్టె ఫ్రెడరిక్సన్‌తో చర్చలు జరుపుతారు. తిరుగు ప్రయాణంలో ఫ్రాన్స్ వెళ్లి అధ్యక్షుడు మాక్రాన్‌తో ముచ్చటిస్తారు. పర్యటనలో మోదీ మొత్తం 25 సమావేశాల్లో పాల్గొంటారు. ప్రవాస భారతీయులతో కూడా భేటీ అవుతానని మోదీ వెల్లడించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులను గట్టిగా వ్యతిరేకిస్తూ యూరప్ దేశాలన్నీ ఏకమైన వేళ భారత్ తటస్థ వైఖరి నేపథ్యంలో ఈ పర్యటన ఆయనకు సవాలేనంటున్నారు. ప్రధానంగా ఇంధన భద్రత, రక్షణ, వాణిజ్య రంగాల్లో బంధాల బలోపేతమే మోదీ ప్రధాన ఎజెండా అని విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా వెల్లడించారు. ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతో పాటు ఈ అంశాలపైనా మోదీ విస్తృతంగా చర్చించనున్నారు.
ఏడు దేశాలకు చెందిన ఎనిమిది మంది ప్రపంచ నేతలతోపాటు 50 మంది అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. ప్రవాస భారతీయులతో భేటీ కానున్నారు. కాగా, ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో ప్రధాని మోడీ యూరప్‌లో పర్యటిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. రష్యా చర్యలను బహిరంగంగా ఖండించడానికి భారతదేశం విముఖత చూపించన సంగతి తెలిసిందే.