Varanasi, October 25: భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రధాన్ మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (PM ABHIM)ను ప్రారంభించారు. ఇవాళ ఉత్తరప్రదేశ్ పర్యటనకు వెళ్లిన ఆయన.. సిద్ధార్థనగర్, వారణాసిలో నగరాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రిబ్బన్ కటింగ్ చేశారు. ఈ క్రమంలోనే వారణాసిలో PM ABHIMను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆపరేషనల్ గైడెన్స్‌ను కూడా విడుదల చేశారు.
దేశవ్యాప్తంగా హెల్త్ కేర్ మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపర్చడం కోసం చేపట్టిన భారీ పథకాల్లో ఇది కూడా (Ayushman Bharat Health Infrastructure Mission) ఒకటని, ఇది నేషనల్ హెల్త్ మిషన్‌కు అదనపు సపోర్టని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. ప్రజారోగ్య విభాగంలో మౌలిక సదుపాయాల కొరతను తీర్చడానికి ఈ కొత్త మిషన్ తోడ్పడుతుందని పేర్కొన్నది. మిషన్‌ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఏండ్ల దేశాన్ని పాలించిన వాళ్లు హెల్త్ కేర్ రంగాన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు.
ఇదిలా ఉంటే వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలకు పాలక బీజేపీ సన్నద్ధమవుతోంది. గత ఐదు రోజుల్లో రెండోసారి ప్రధాని నరేంద్ర మోదీ యూపీ పర్యటనకు వచ్చారు. సిద్ధార్ధ్‌నగర్, ఈటా, హర్దోయ్, ప్రతాప్‌ఘఢ్, ఫతేపూర్, దియోరియా, ఘజీపూర్, మీర్జాపూర్, జాన్పూర్ జిల్లాల్లో 9 మెడికల్ కాలేజీలను ప్రధాని ఈ సందర్భంగా ప్రారంభించారు.
గత పాలకులు తమ కుటుంబ లాకర్లు నింపుకోవడంలో తలమునకలై స్వార్ధ ప్రయోజనాల కోసం పనిచేశారని మోదీ విమర్శలు గుప్పించారు. ఒకేసారి తొమ్మిది వైద్య కళాశాలలను గతంలో ఎన్నడైనా ప్రారంభించడం చూశారా అని ప్రశ్నించారు. పూర్వాంచల్ ప్రజలను గత ప్రభుత్వాలు గాలికొదిలేశాయని, తమ హయాంలో పూర్వాంచల్ ప్రాంతం ఉత్తరాదికే మెడికల్ హబ్‌గా మార్చామని చెప్పుకొచ్చారు. ఇక ప్రధాని మోదీ తన నియోజకవర్గం వారణాసిలో రూ 5200 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు.