PM Narendra Modi (Photo Credits: ANI/File)

New Delhi, June 13:  దేశవ్యాప్తంగా పెరుగుతున్న కేసులు, దేశంలో కోవిడ్ వ్యాప్తికి సంబంధించి ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం సీనియర్ మంత్రులు మరియు సంబంధిత శాఖల అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆరోగ్య మంత్రి హర్ష్ వర్ధన్, ప్రధాన మంత్రి ప్రధాన కార్యదర్శి మరియు నీతి ఆయోగ్ సభ్యులు, ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

పెరుగుతున్న కేసుల నేపథ్యంలో మళ్ళీ లాక్డౌన్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందా? అనే ఊహాగానాల నడుమ ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈనెల 16, 17వ తేదీల్లో ప్రధాని మోదీ మరోసారి వీడియో సమావేశం నిర్వహించనున్నారు.  రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రధాని మోదీ ముఖ్యమంత్రులను అడిగి తెలుసుకోనున్నారు.

 

 

దేశవ్యాప్తంగా ఈరోజు అత్యధికంగా 11,458 కరోనావైరస్ కేసులు నమోదు అయ్యాయి, దేశంలోని మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య 3,08,993 దాటిపోయింది. ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ చేత తీవ్రంగా ప్రభావితం కాబడ్డ మొదటి 10 దేశాలలో భారతదేశం ప్రస్తుతం నాల్గవ స్థానంలో కొనసాగుతోంది.

కరోనా తీవ్రత ఏ మేరకు ఉండవచ్చు  అనే అంచనాలను నీతి ఆయోగ్ యొక్క సీనియర్ సభ్యులు ఈ సమావేశంలో ప్రెజెంటేషన్ ఇచ్చినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న మొత్తం కేసులలో, మూడింట రెండొంతులు ఐదు రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయని, అది కూడా పెద్ద నగరాల్లోనే అత్యధిక సంఖ్యలో కేసులున్నాయని నీతిఆయోగ్ సభ్యులు ప్రధానికి వివరించినట్లు సమాచారం.

తాజా పరిణామాలు గమనిస్తుంటే, ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ తర్వాత కేంద్ర ప్రభుత్వం మళ్ళీ  ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులేస్తున్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి.