New Delhi, January 10: ప్రధాని నరేంద్రమోదీ భద్రతాలోపంపై (PM Narendra Modi Security Lapse Case) సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనపై ఇక స్వతంత్ర కమిటీ దర్యాప్తు చేపట్టనుందని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. పంజాబ్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఘటనపై సమగ్ర దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ఒక స్వతంత్ర కమిటీని (Supreme Court Sets Up Panel ) వేసేందుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. అయితే, ఇప్పటికే ప్రధాని భద్రతాలోపంపై కేంద్ర కమిటీ దర్యాప్తు చేస్తున్నది.
కేంద్ర కమిటీ దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందని తమకు నమ్మకం లేదని, రాష్ట్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ కమిటీ నివేదిక ఇచ్చే అవకాశం ఉన్నదని పంజాబ్ ప్రభుత్వం (Punjab government) అనుమానాలు వ్యక్తంచేసింది. ఇప్పటికే పంజాబ్ అధికారులను దోషులుగా చిత్రీకరిస్తూ 7 షోకాజ్ నోటీసులు ఇచ్చిందని పంజాబ్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో ఘటనపై దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర కమిటీని నియమించాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. స్వతంత్ర కమిటీ దర్యాప్తులో దోషులుగా తేలితే నన్ను, నా అధికారులను ఉరితీయండని పంజాబ్ ఏజీ వాదించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్రాన్ని మందలించింది. కొందరిని దోషులుగా చిత్రించి, చర్యలు తీసుకుంటూ షోకాజ్ నోటీసులు ఇచ్చిన తర్వాత తాము విచారణ చేపట్టాల్సిన అవసరం ఏముందని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ కేంద్ర తరఫున వాదనలు వినిపించారు.
ప్రధాని భద్రతా వైఫల్యం, 150 మంది అజ్ఞాత వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ఫిరోజ్‌పూర్ జిల్లా పోలీసులు
ప్రధాని భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి ఎస్‌పీజీ చట్టం ప్రకారం సంబంధిత అధికారులను ప్రశ్నించే అధికారం కేంద్రానికి ఉందని సొలిసిటర్ జనరల్ వాదించారు. ప్రధాని పర్యటన ముందుగానే ఖరారైందని, వాతావరణ పరిస్థితుల దృష్ట్యానే రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నారని, దీనిపై రాష్ట్ర ఏజన్సీలకు ముందుగానే సమాచారం ఇచ్చారని సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. ప్రధాని వాహనశ్రేణికి ముందున్న సెక్యూరిటీ వాహనం 100 మీటర్ల సమీపానికి వచ్చేవరకు పంజాబ్ అధికారులు రోడ్డు క్లియర్‌గా ఉందని తప్పుడు సమాచారం ఇచ్చారని ఆయన ఆరోపించారు.
దీనిపై జస్టిస్ హిమా కోహ్లీ స్పందిస్తూ.. ''మీరు ఇప్పటికే పంజాబ్ అధికారులది తప్పని తేల్చి షోకాజ్ నోటీసులు ఇచ్చేశారు. అంటే మీకు ఎలా ముందుకెళ్లాలో తెలుసు. అలాంటప్పుడు కోర్టు వద్దకు ఎందుకు వచ్చారు'' అని ఎస్‌జీని ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు జారీచేసింది. స్వతంత్ర కమిటీలో చండీగఢ్ డీజీపీ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఐజీ, పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, పంజాబ్ ADGP (సెక్యూరిటీ)లను సుప్రీంకోర్టు సభ్యులుగా చేర్చింది.
కాగా గతవారం పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్ జిల్లాకు ప్రధాని మోదీ వెళుతుండగా ఆందోళనకారులు రహదారిని దిగ్బంధించడంతో ఆయన వాహనశ్రేణి 20 నిమిషాలపాటు ఫ్లైఓవర్‌పై చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన బహిరంగ సభ సహా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనకుండానే వెనుదిరిగారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ 'లాయర్స్ వాయిస్' అనే సంస్థ పిల్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం.. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపేందుకు కేంద్ర హోంశాఖ, పంజాబ్ ప్రభుత్వం వేసిన కమిటీలు తక్షణమే తమ దర్యాప్తులను నిలిపివేయాలని ఆదేశించింది. దీనిపై పూర్తి వివరాలను త్వరలోనే జారీ చేస్తామని ధర్మాసనం వెల్లడించింది.