New Delhi, February 5: భారత ప్రధాని నరేంద్రమోదీ నేడు హైదరాబాద్ (PM Narendra Modi to Visit Hyderabad) వస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి ప్రధాని నేరుగా హెలికాప్టర్‌లో పటాన్‌చెరులోని ఇక్రిశాట్ అంతర్జాతీయ పరిశోధన సంస్థకు చేరుకుని స్వర్ణోత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం ముచ్చింతల్ చేరుకుని రామానుజాచార్య విరాట్ విగ్రహాన్ని (Statue of Equality) ఆవిష్కరిస్తారు. అక్కడే దాదాపు మూడు గంటలపాటు ఉంటారు.
ప్రధాని హైదరాబాద్‌లో అడుగుపెట్టింది మొదలు తిరిగి వెళ్లే వరకు కేసీఆర్ ఆయన వెంటే ఉంటారు. ప్రధాని పర్యటన బాధ్యతలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షిస్తున్నారు. మోదీ పర్యటనలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్రమంత్రి తోమర్, కిషన్ రెడ్డి తదితరులు కూడా పాల్గొంటారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో నగరంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆయన పర్యటించే మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.
నగర శివార్లలోని ముచ్చింతల్‌లో శ్రీరామనుజాచార్యుల (Ramanujacharya) సహస్రాబ్ది ఉత్సవాలు నాలుగవ రోజుకు చేరుకున్నాయి. ఈ మహాక్రతువు 12 రోజులపాటు జరగనున్నది. ఉత్సవాల్లో నాలుగో రోజైన అష్టాక్షరీ మహామంత్ర జపం, హోమాలు, పూర్ణాహుతి నిర్వహించనున్నారు. వసంత పంచమి సందర్భంగా యాగశాలలో విష్వక్సేనేష్ఠి నిర్వహిస్తారు.
ప్రధాని మోదీ కార్యక్రమం షెడ్యూల్
కార్యక్రమంలో ప్రధానఘట్టం ఇవాళ సాయంత్రం జరగనున్నది. 216 అడుగుల సమతామూర్తి భగవద్రామానుజుల విగ్రహాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ప్రధాని మోదీ శనివారం మధ్యాహ్నం 2.10 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి పటాన్ చెరువులోని ఇక్రిశాట్‌కు చేరుకుంటారు. ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో పాల్గొనున్న మోదీ.. నాలుగున్నరకి తిరిగి శంషాబాద్ వస్తారు. అక్కడి నుంచి సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రధాని ముచ్చింతల్‌కు చేరుకుంటారు. దాదాపు 3 గంటలపాటు సమతామూర్తి కేంద్రంలోనే మోదీ పర్యటిస్తారు.
మొదట యాగశాలకు చేరుకొని విశ్వక్ సేనుడిని ఆరాధిస్తారు. అక్కడి నుంచి సమతామూర్తి కేంద్రానికి వస్తారు. ఆ తర్వాత 108 దివ్యదేశాలను సందర్శిస్తారు. భద్రవేది మొదటి అంతస్తులో ఉన్న రామానుజచార్యుల 120 కిలోల బంగారు విగ్రహాన్ని తిలకిస్తారు. అనంతరం భద్రవేదిపై బ్రహ్మాండ నాయకుడిగా కొలువుదీరిన సమతామూర్తి విగ్రహానికి పూజలు నిర్వహించి జాతికి అంకితం చేస్తారు. ఆ తర్వాత శ్రీరామానుజచార్యుల విశిష్టతపై ప్రసంగిస్తారు. అనంతరం ఢిల్లీకి తిరుగుపయణమవుతారు.