Narendra Modi (Photo Credits: ANI)

Lucknow, Dec 21: వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రధాని ఆ రాష్ట్రంలో సుడిగాలి పర్యటన నిర్వహిస్తున్నారు. గత నెల రోజుల్లో పది రోజులు యూపీ పర్యటనలోనే ఉన్న ప్రధాని నేడు ప్రయాగ్‌రాజ్‌లో (PM Modi to Visit Prayagraj) పర్యటించనున్నారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సహాయక సంఘాల బ్యాంకు ఖాతాల్లోకి రూ.వెయ్యి కోట్లు రుణాన్ని బదిలీ (Will Transfer Rs 1,000 Crore to SHGs Benefitting) చేయనున్నారు. దాదాపు 16లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు (16 Lakh Women) ప్రయోజనం చేకూరనున్నది. అట్టడుగు స్థాయిలో మహిళలకు సాధికారత కల్పించాలనే ప్రధాని మోదీ దార్శనికతకు అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

దీన్‌దయాళ్‌ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌ కింద రూ.వెయ్యి కోట్లను మహిళా సంఘాల సభ్యుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అలాగే కన్యా సుమంగళ పథకానికి సైతం శ్రీకారం చుట్టనున్నారు. ఈ పథకం కింద లక్ష మంది లబ్ధిదారులకు రూ.20కోట్లకుపైగా నగదును ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ పథకం కింద బాలికల జీవితంలో వివిధ దశల్లో మొత్తం రూ.15వేల నగదు బదిలీ జరుగనున్నది. 80 వేల స్వయం సహాయక సంఘాలకు చెందిన ఒక్కో గ్రూపునకు రూ.1.10 లక్షల చొప్పున రూ. 880 కోట్ల సీఐఎఫ్‌ను కూడా ప్రధాని మోదీ ఇవ్వనున్నారు. దీంతో పాటు 60 వేల స్వయం సహాయక సంఘాలకు ఒక్కో గ్రూపునకు 15 వేల రూపాయల చొప్పున మొత్తం 120 కోట్ల రూపాయలను అందజేయనున్నారు.

పుట్టిన సమయంలో రూ.2వేలు, ఏడాది టీకాల తర్వాత రూ.1000, ఒకటో తరగతిలో చేరిన సమయంలో రూ.2వేలు, ఆరో తరగతిలో చేరిన తర్వాత రూ.2వేలు, తొమ్మిది తరగతిలో ప్రవేశం అనంతరం రూ.3వేలు, పది లేదంటే ఇంటర్‌లో ఉత్తీర్ణత అనంతరం, డిగ్రీ ఇతర డిప్లొమా కోర్సుల్లో చేరిన అనంతరం రూ.5వేలు బాలికల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఆయా పథకాలతో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మహిళా ఓటర్ల గాలం వేసేందుకు ప్రయత్నిస్తున్నది.

దీంతో పాటు 202 సప్లిమెంటరీ న్యూట్రిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌కు కూడా పీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాలకు చెందిన 78 మంది మహిళలతో కూడా ప్రధాని మోదీ నేరుగా సంభాషించనున్నారు. ప్రధాని మోదీ కార్యక్రమానికి సన్నాహాలు పూర్తయ్యాయి. ప్రధాని మోదీ కార్యక్రమానికి 2 లక్షల మందికి పైగా మహిళలు హాజరవుతారని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ప్రధాని మోదీ దాదాపు రెండు గంటల పాటు ప్రయాగ్‌రాజ్‌లో పర్యటించనున్నారు.