New Delhi, November 28: ప్రధాని మోదీ నేడు మూడు నగరాలలో (PM Narendra Modi Tour) పర్యటించనున్నారు. కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు (Corona vaccine trials) తుది దశకు చేరుకోవడంతో తాజా పరిస్థితుల్ని సమీక్షించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఒకే రోజు పుణె, అహ్మదాబాద్, హైదరాబాద్‌లలో వ్యాక్సిన్ తయారీ కేంద్రాలను సందర్శించనున్నారు. ప్రధాని స్వయంగా శనివారం ఈ మూడు నగరాలకు వెళ్లి కరోనా వ్యాక్సిన్ పురోగతిని సమీక్షిస్తారని పీఎంఓ కార్యాలయం వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే చేపట్టాల్సిన చర్యలపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈనెల 24న ప్రధాని సమీక్ష నిర్వహించిన విషయం విదితమే.
అహ్మదాబాద్‌లో జైడస్ బయోటెక్ పార్క్‌ని (Zydus Biotech Park), హైదరాబాద్‌లో భారత్ బయోటెక్ (Bharat Biotech), పుణెలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాను (Serum Institute of India) ప్రధాని మోదీ సందర్శిస్తారని ప్రధాని కార్యాలయం ఒక ట్వీట్‌లో పేర్కొంది. కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు దాదాపుగా పూర్తి కావస్తూ ఉండడంతో శాస్త్రవేత్తలతో స్వయంగా ప్రధాని మోదీ మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకోనున్నారు. దీని వల్ల భారత్‌లో వంద కోట్లకు పైగా జనాభాకి వ్యాక్సిన్ ఇవ్వడంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి అవసరమయ్యే మార్గదర్శకాల రూపకల్పన చేసుకోవచ్చునని పీఎంఓ తెలిపింది.
పర్యటన షెడ్యూల్ ఇలా: శనివారం ఉదయం తొలుత గుజరాత్‌లోని జైడస్ క్యాడిలా ప్లాంట్‌ను ప్రధాని సందర్శించనున్నారు. అహ్మదాబాద్‌కి 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ ప్లాంట్‌కి మోదీ 9.30కి చేరుకుంటారని గుజరాత్ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. జైడస్ తయారు చేస్తున్న జికోవ్–డి వ్యాక్సిన్ ప్రస్తుతం రెండో దశ ప్రయోగాలు జరుగుతున్నాయి. ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం కాకుండా ప్రధాని పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.
ప్రధాని మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రత్యేక విమానంలో హకింపేటలోని సైనిక విమానాశ్రయానికి చేరుకుంటారు.అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భారత్ బయోటెక్ కు వెళ్లి అక్కడ వ్యాక్సిన్ తయారీని పరిశీలిస్తారు. భారత్ స్వదేశీయంగా రూపొందిస్తున్న ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం మూడో దశ ప్రయోగాల్లో ఉంది. దీని గురించి శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకోనున్నారు. ఈసందర్భంగా అక్కడ నిర్వహించే ఒక కార్యక్రమంలో దాదాపు గంటసేపు పాల్గొంటారు. హైదరాబాద్ పర్యటన అనంతరం సాయంత్రం 4.30 గంటలకు పుణెలోని సీరమ్ ఇనిస్టిట్యూట్‌కి వెళతారు. ఆస్ట్రాజెనికా–ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కరోనా వ్యాక్సిన్ ఇక్కడ తయారవుతోంది. సాయంత్రం ప్రధాని ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.
జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు రెండు రోజుల ముందు ప్రధాని అధికారిక పర్యటనలో భాగంగా హైదరాబాద్ నగరానికి వస్తుండడంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ శనివారం హైదరాబాద్ పర్యటన సందర్భంగా హకీంపేట ఎయిర్‌పోర్టులో ఆయనకు స్వాగతం తెలపడానికి కేవలం ఐదుగురు అధికారులకు మాత్రమే ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) అనుమతించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ప్రధాని పర్యటనలో సీఎం కేసీఆర్ రానవసరం లేదని తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్‌కు ప్రధాని వ్యక్తిగత సహాయకుడు వివేక్ తెలిపినట్లు సమాచారం. ప్రధానికి స్వాగతం చేప్పడానికి హకీంపేట ఎయిర్ ఆఫీస్ కమాండెంట్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, మేడ్చల్ కలెక్టర్ శ్వేతా మొహంతి, సైబరాబాద్ సీపీ సజ్జనార్ మాత్రమే రావాలని పీఎంవో ఆదేశాలు పంపినట్లుగా తెలుస్తోంది.