New Delhi, April 11: అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi Video Conference) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కేసులు ( Coronavirus) పెరుగుతున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధాని అన్ని రాష్ట్రాల సీఎంలతో తన కార్యాలయం నుంచి చర్చించారు. లాక్‌డౌన్ కొనసాగించాలనే అంశంపై వారి సూచనల్ని స్వీకరించారు.
దేశంలో 24 గంటల్లో కరోనా కల్లోలం, 40 మంది మృతి
ఇక మే 1 వరకు లాక్‌డౌన్‌ను (Lockdown) పొడిగిస్తూ ఒడిశా, పంజాబ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు (Telangana CM KCR) కూడా లాక్‌డౌన్‌ను మరో 2 వారాలపాటు పొడిగించాలని ఇప్పటికే ప్రధానిని కోరారు.
మరోవైపు భారత్‌లో లాక్‌డౌన్‌ను (India Lockdown) తక్షణమే ఎత్తేస్తే పరిస్థితి దిగజారే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వైద్య నిపుణులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత వైద్య పరిశోధన సంస్థ సూచనలను, ఆర్థిక అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రధాని మోదీ నిర్ణయం ప్రకటించనున్నారు. కాగా, గత నెల 25న విధించిన లాక్‌డౌన్ ఈ నెల 14తో ముగియనుంది.
Here's a tweet of PM Modi interacting with states chief ministers:
Delhi: Prime Minister Narendra Modi holds a meeting via video-conferencing with the Chief Ministers over #COVID19. pic.twitter.com/yd6mdCzukr
— ANI (@ANI) April 11, 2020
Delhi: Prime Minister Narendra Modi seen wearing a mask during video-conferencing with the Chief Ministers over #COVID19. Other CMs are also using masks. pic.twitter.com/N6Qfjq9xjy
— ANI (@ANI) April 11, 2020
కరోనా పోరులో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సూచనలు స్వీకరించేందుకు తాను 24/7 అందుబాటులో ఉంటానని ప్రధాని మోదీ (PM Modi) తెలిపారు. సీఎంలతో జరుగుతున్న వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన నోటికి తెల్లని మాస్కు ధరించి పాల్గొన్నారు. కాగా, దేశవ్యాప్తంగా శనివారం ఉదయం వరకు 7400 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా.. 239 మంది మరణించారు.
పార్లమెంటులో వేర్వేరు రాజకీయ పార్టీల నేతలతో మోదీ మూడు రోజుల క్రితం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన...ఏప్రిల్ 14వ తేదీ తరువాత ఒకేసారి లాక్‌డౌన్ ఎత్తివేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ప్రతి ప్రాణాన్ని కాపాడుకోవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కూడా ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రాలు, జిల్లా స్థాయి యంత్రాంగం, నిపుణులు కూడా లాక్‌డౌన్‌ను పొడిగించాలనే సూచిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రధాని మోదీ సీఎంలతో సంప్రదింపులు జరపడం ఇది రెండోసారి. ఏప్రిల్ 2న తొలి సమావేశంలో దశలవారీ లాక్‌డౌన్ ఎత్తివేతకు అనుకూలంగా ప్రధాని మాట్లాడారు. మరోవైపు దేశవ్యాప్త లాక్‌డౌన్‌పై తమ అభిప్రాయాలు తెలపాల్సిందిగా కేంద్ర హోం శాఖ రాష్ట్రాలను కోరింది. ఏప్రిల్ 14 తరువాత మరో రెండు వారాలపాటు లాక్‌డౌన్ కొనసాగుతుందన్న వార్తలు వస్తున్న తరుణంలో హోంశాఖ ఈ సమాచారం కోరింది.
గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ రంగ కార్యకలాపాలకు అనుమతి ఇవ్వాలన్న సూచనలు ఎక్కువగా రాష్ట్రాల నుంచి ఉన్నాయని తెలిసింది. లాక్‌డౌన్ సందర్భంగా ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంతోపాటు అత్యవసర వస్తువుల విక్రయ కేంద్రాలు తెరిచే ఉంటాయని కేంద్రం ప్రకటించింది. వీటితోపాటు ఆరోగ్యం, పారిశుద్ధ్యం, పోలీస్, మీడియా, బ్యాంకులు పనిచేస్తాయని చెప్పింది.
సీఎంలతో సమావేశానంతరం ప్రధాని మోదీ మరోసారి జాతి ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మంగళవారం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ముగియనున్న నేపథ్యంలో మళ్లీ ఆయన కీలక ప్రకటన చేయనున్నారు.
లాక్‌డౌన్‌ను పొడిగించాలి: పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్
లాక్‌డౌన్‌ను పొడిగించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కోరారు.'దేశ వ్యాప్తంగా కనీసం రెండు వారాలయినా లాక్‌డౌన్ పొడిగించాలి. అయితే, పరిశ్రమలు, వ్యవసాయ రంగాలను దీని నుంచి వెంటనే మినహాయింపును ఇవ్వాలి' అని కోరారు.
అలాగే, దేశంలో కరోనా బాధితులను గుర్తించడానికి ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను వేగవంతంగా సరఫరా చేయాలని చెప్పారు. మోదీతో మాట్లాడుతూ లాక్‌డౌన్ ఎత్తివేతపై పలు రాష్ట్రాల సీఎంలు పలు సూచనలు చేశారు. చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్‌డౌన్‌ను పొడిగించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ ఎత్తివేతపై మోదీ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
వీడియో కాన్ఫరెన్స్ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. మోదీతో మాట్లాడుతూ లాక్‌డౌన్ ఎత్తివేతపై పలు సూచనలు చేశారు. 'నేను ఓ సూచన చేస్తున్నాను. కరోనా విజృంభణ ఇప్పటికీ ఆగలేదు కనుక ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించాలి' అని కేజ్రీవాల్ అన్నారు.
లాక్‌డౌన్ ఎత్తివేసే అంశంపై అనుసరించాల్సిన వ్యూహాలపై సూచనలు చెప్పాలని మోదీ కోరారు. అలాగే, లాక్‌డౌన్ ఎత్తివేయకపోతే మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అంశాలపై కూడా ఆయన ప్రధానంగా చర్చిస్తున్నారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్‌డౌన్‌ను పొడిగించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.