PM Vishwakarma Scheme: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవిగో, చేతి వృత్తుల వారికి రూ. లక్ష రుణం, సెప్టెంబరు 17 నుంచి పీఎం విశ్వ‌క‌ర్మ స్కీమ్ అమల్లోకి..
Union Minister Ashwini Vaishnaw (File photo/ANI)

New Delhi, August 16: కేంద్ర కేబినెట్‌ ఈ రోజు పలు కొత్త పథకాలతో పాటు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో నిర్ణయాలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వివరించారు. పీఎం విశ్వ‌క‌ర్మ స్కీమ్(PM Vishwakarma Scheme) కింద ఆ వృత్తిలో ఉన్న వారికి ల‌క్ష రూపాయ‌ల రుణం ఇవ్వ‌నున్న‌ది. అత్య‌ధికంగా 5 శాతం వ‌డ్డీతో ఆ రుణాన్ని ఇవ్వ‌నున్న‌ట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ తెలిపారు. చాలా స‌ర‌ళ ప‌ద్ధ‌తిలో సంప్ర‌దాయ నైపుణ్యం క‌లిగిన వారికి రుణాలు ఇవ్వ‌నున్న‌ట్లు మంత్రి చెప్పారు.పీఎం విశ్వ కర్మ కింద చేతివృత్తుల వారికి మొత్తంగా రూ.13వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది.

చేతివృత్తులు నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవారి కోసం ఈ పథకం కింద రెండు శిక్షణ కార్యక్రమాలను తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకున్న వారికి రోజుకు రూ.500 ఉపకార వేతనంతో మెరుగైన శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ తర్వాత పరికరాల కొనుగోలు కోసం రూ.15వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు.

కృష్ణ జ‌న్మ‌భూమి వ‌ద్ద అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు, వెంటనే ఆపాలంటూ కీలక ఆదేశాలు జారీ చేసిన సుప్రీం కోర్టు

ఆ తర్వాత వడ్డీపై రాయితీతో తొలుత రూ.లక్ష రుణం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. తొలి విడత సద్వినియోగం చేసుకుంటే రెండో విడత కింద రూ.2లక్ష రుణం మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఈ పథకంతో ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన సంప్రదాయ కళాకారులు, చేనేతకారులు, స్వర్ణకారులు, వడ్రంగులు, రజకులు, క్షురకుల కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా సెప్టెంబరు 17 నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.

దీంతో పాటుగా పీఎం ఈ-బ‌స్ సేవా ప‌థ‌కానికి ఆమోదం ద‌క్కిన‌ట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ స్కీమ్ కోసం 57,613 కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్నారు. సుమారు ప‌దివేల కొత్త ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను దేశ‌వ్యాప్తంగా అందించ‌నున్న‌ట్లు మంత్రి చెప్పారు. ఈ మొత్తంలో కేంద్ర‌మే రూ. 20వేల కోట్లు ఇవ్వ‌నున్న‌ది. 3 ల‌క్ష‌ల క‌న్నా ఎక్కువ జ‌నాభా ఉన్న న‌గ‌రాల్లో ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తారు. పీపీపీ ప‌ద్ధ‌తిలో దాదాపు ప‌ది వేల ఈ-బ‌స్సులు అందుబాటులోకి రానున్నాయ‌న్నారు. ప‌దేళ్ల పాటు ఆ బ‌స్సులు న‌డ‌వ‌నున్నాయి. కాగా పట్టణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేసేలా కేంద్ర ప్రభుత్వం ఈ కీలక చర్యలు చేపట్టింది.

భర్త అతి తాగుడు క్రూరత్వమే అంటూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆ తాగుడు కుటుంబ పరిస్థితిని దిగజార్చుతుందని భార్యకు విడాకులు మంజూరు

డిజిటల్‌ ఇండియా (Digital India) పథకానికి కేంద్ర మంత్రివర్గం నేడు ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.14,903 కోట్లు కేటాయించినట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. ఈ ప్రాజెక్టు కింద 5.25లక్షల మంది ఐటీ ఉద్యోగులకు నైపుణ్యాలను మెరుగుపర్చనున్నట్లు తెలిపారు. దీంతో పాటు మరో 9 సూపర్‌ కంప్యూటర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. అలాగే 181 నగరాల్లో గ్రీన్ ఈ-మొబిలిటి కోసం మౌలిక సదుపాయాలు పెంచాలని నిర్ణయించింది.

దేశవ్యాప్తంగా ఏడు మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇందుకోసం 32,500 కోట్ల రూపాయల ఖర్చు చేయనున్న కేంద్రం వీటిలో ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలను కలుపుతూ రైల్వే ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ప్రధానంగా గుంటూరు - బీబీ నగర్ మధ్య 239 కిలో మీటర్ల రైల్వే లైన్ డబ్లింగ్‌కు ఆమోదం తెలిపిన కేంద్రం.. ఇందుకోసం రూ. 3238 కోట్లు ఖర్చు చేయనుంది. ఇక హైదరాబాద్ - చెన్నై మధ్య 76 కిలో మీటర్ల దూరం తగ్గనుంది.

మరోవైపు ముద్కేడ్ - మేడ్చల్, మహబూబ్ నగర్ - డోన్ మధ్య రైల్వే లైన్ డబ్లింగ్‌కు ఆమోదం లభించింది. తద్వారా హైదరాబాద్ - బెంగళూరు మధ్య 50 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. మరోవైపు ఏపీలో.. విజయనగరం నుంచి ఖుర్ధా రోడ్ మీదుగా నెర్గుండి వరకు మూడో రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. అలాగే విశాఖపట్నం - చెన్నై మధ్య మూడో రైల్వే లైన్ డీపీఆర్‌ సిద్దం కాగా.. మూడు వేల కోట్ల ఖర్చుతో నిర్మాణ పనులు జరగనున్నాయి.