5 Soldiers Killed in Poonch Accident (Photo Credits: X/@SachinGuptaUP)

Poonch, Dec 24: జమ్మూ కశ్మీర్‌ పూంచ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మెంధార్‌ సమీపంలోని బల్నోయి వద్ద సైనికులు ప్రయాణిస్తున్న ఆర్మీ వాహనం భారీ లోయలో పడి పోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు సైనికులు మరణించారు. పలువురు సైనికులకు గాయాలు అయ్యాయి. మంగళవారం నీలం నుంచి బల్నోయ్ గోరా పోస్ట్‌కు సైనికులు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

దాదాపు 350 అడుగుల లోతు ఉన్న లోయలో ఆర్మీ వాహనం పడిపోయింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న సైనిక ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకొని.. సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వైద్య చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

పూంఛ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం, 300 అడుగుల లోతున్న‌ లోయ‌లో పడిన జ‌వాన్ల‌ వాహ‌నం, ఐదుగురు సైనికులు అక్కడికక్కడే మృతి

కాగా గత నెలలో రాజౌరి జిల్లాలో కాలాకోట్ సమీపంలోని బడ్గో గ్రామం వద్ద సైనికులు వెళ్తున్న వాహనం అదుపు తప్పి.. లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఒక సైనికుడు మరణించగా మరో సైనికుడు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన సైనికుడు ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడని సైనిక ఉన్నతాధికారులు తెలిపారు. మరో ఘటనలో రైయిసీ జిల్లాలో కారు లోయలో పడి మహిళ, 10 ఏళ్ల బాలుడు మరణించారని ఆర్మీ అధికారులు తెలిపారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని సైనిక అధికారులు వివరించారు.