Prime Minister Narendra Modi at the Bochasanwasi Akshar Purushottam Swaminarayan Sanstha (BAPS) Mandir in Abu Dhabi.

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE) రాజధాని అబుదాబిలో ఏకంగా 27 ఎకరాల్లో సువిశాలమైన బోచసన్వాసి శ్రీ అక్షర్‌ పురుషోత్తం స్వామినారాయణ్‌ సంస్థ (BAPS) మందిరాన్ని (BAPS Hindu Mandir) ప్రధానమంత్రి నరేం‍ద్రమోదీ ప్రారంభించారు. అబుదాబిలోని బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (BAPS) మందిర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రశాంతంగా గడిపారు.

యూఏఈలోనే గాక మొత్తం మధ్యప్రాచ్యంలోనే పూర్తి హిందూ సంప్రదాయ రీతుల్లో నిర్మితమైన తొలి రాతి ఆలయమిది. భారత్‌తో యూఏఈ పటిష్ట బంధానికే గాక ఆ దేశ మత సామరస్యానికి కూడా ప్రతీకగా ఈ మందిరం అలరారనుంది. ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అక్షయ్‌ కుమార్‌, వివేక్‌ ఒబెరాయ్‌, మ్యూజిక్‌ కంపోజర్‌ శంకర్ మహదేవన్‌ హాజరయ్యారు.

అబుదాబిలో మొదటి హిందూ రాతి ఆలయాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ, వీడియో ఇదిగో..

దుబాయ్‌లో ఇప్పటికే రెండు హిందూ దేవాలయాలు, ఒక సిక్కు గురుద్వారా ఉన్నాయి.అయితే యూఏఈ మొత్తంలో పూర్తి హిందూ శైలిలో రూపొందిన తొలి ఆలయం బాప్స్‌ మందిరం. దుబాయ్‌–అబుదాబి హైవే సమీపంలో వద్ద 27 ఎకరాల్లో ఈ ఆలయం నిర్మితమైంది.మొత్తం నిర్మాణం బాప్స్‌ సంస్థ కనుసన్నల్లో జరిగింది. దీని నిర్మాణానికి రూ.700 కోట్లు ఖర్చయింది. 108 అడుగల ఎత్తు, 262 అడుగుల పొడవు, 180 అడుగుల వెడల్పుతో మొత్తం 55 వేల చదరపు మీటర్ల వైశాల్యంలో ఆలయం రూపుదిద్దుకుంది.

యుఎఇలో మొట్టమొదటి హిందూ దేవాలయం ప్రత్యేకతలు ఇవిగో, అబుదాబిలో BAPS మందిర్ గురించి పూర్తి సమాచారం మీకోసం

దీని నిర్మాణానికి దాదాపు మూడున్నరేళ్లు పట్టింది. రాజస్తాన్, గుజరాత్‌కు చెందిన 2 వేల మందికి పైగా కార్మికులు, నిపుణులు మూడేళ్ల పాటు శ్రమించి 402 తెల్లని పాలరాతి స్తంభాలను చెక్కారు.ఆలయ నిర్మాణంలో స్టీల్, కాంక్రీట్, సిమెంట్‌ ఏ మాత్రమూ వాడలేదు. అయోధ్య రామాలయం మాదిరిగానే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రాళ్ల వరుసలను నేర్పుగా పరస్పరం కలుపుతూ పోయారు. ఆలయం నిర్మాణంలో ఉపయోగించిన పాలరాతి తదితరాలను పూర్తిగా రాజస్తాన్‌లోని భరత్‌పూర్‌ నుంచి, శిల్పాలను భిల్వారా నుంచి తెప్పించారు. లోపలి నిర్మాణాల్లో ఇటాలియన్‌ మార్బుల్‌ వాడారు.

Here's Video

మందిర పునాదుల్లో 100కు పైగా సెన్సర్లను కూడా ఏర్పాటు చేయడం విశేషం. భూకంపాలతో పాటు ఉష్ణోగ్రత, ఒత్తిళ్లు తదితరాల్లో మార్పులను ఇవి ఎప్పటికప్పుడు పట్టిస్తాయి. మొత్తం 25 వేల పై చిలుకు విడి భాగాలుగా భారత్‌లో నిపుణులైన పనివాళ్లతో తయారు చేయించి యూఈఏలో ఆలయంలో జోడించారు. ఆలయ కాంప్లెక్సులో ప్రార్థన మందిరం, సందర్శకుల కేంద్రం, థీమాటిక్‌ గార్డెన్లు, గ్రంథాలయం, గ్యాలరీ, ఎగ్జిబిషన్‌ సెంటర్లు, ఏకంగా 5,000 మంది పట్టే రెండు కమ్యూనిటీ హాళ్లతో పాటు ప్రత్యేకించి పిల్లల కోసం ఆటస్థలం కూడా ఉన్నాయి. మందిర ప్రారంభోత్సవంలో పాల్గొనాలనుకునే వారికోసం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ పోర్టల్‌ ప్రారంభించారు.

ఆలయంలోని ఏడు గోపురాలను యూఏఈలోని ఏడు ఎమిరేట్లకు ప్రతీకగా తీర్చిదిద్దారు.రామాయణ ఇతివృత్తాలను ఆలయ గోడలపై, ఆలయం బయటి గోడలపై ప్రపంచ ప్రసిద్ధ నాగరికతలన్నింటినీ చెక్కారు. భక్తుల బస తదితరాలకు ఆలయ సమీపంలో భవనం కూడా ఏర్పాటైంది. దీన్ని అరేబియన్, ఇస్లామిక్‌ వాస్తు రీతుల్లో నిర్మించారు.